Japanese Billionaire Returns To Earth : క్షేమంగా భూమిపైకి..జపాన్ కుబేరుడి అంతరిక్ష యాత్ర విజయవంతం

జపాన్ కుబేరుడు "యుసాకు మెజవా" అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగిసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజులు గడిపిన యుసాకు మెజవా.. సోమవారం తిరిగి భూమిపై కాలు మోపాడు.

Japanese Billionaire Returns To Earth : జపాన్ కుబేరుడు “యుసాకు మెజవా” అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగిసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజులు గడిపిన యుసాకు మెజవా.. సోమవారం తిరిగి భూమిపై కాలు మోపాడు. కజకిస్తాన్​లోని జెజ్కాగన్ ప్రాంతానికి 150 కి.మీ దూరంలో సోమవారం ఉదయం 8.43 గంటలకు..మెజవాతో పాటు ఆయన ప్రొడ్యూసర్ యొజో హిరానో, రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ మిసుర్కిన్ సైతం సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యారు.

రష్యన్ ‘సోయుజ్’ అంతరిక్ష నౌకలో ఈ యాత్ర చేశారు. దీంతో 2009 తర్వాత సొంత ఖర్చులతో అంతరిక్ష పర్యటనకు వెళ్లిన వ్యక్తులుగా మెజవా, హిరానో రికార్డు సృష్టించారు. అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములకు ‘ఉబర్​ ఈట్స్’ సంస్థ ఆహార పదార్థాలను పంపించగా.. మెజవా వాటిని చేరవేశారు.

కాగా,యుసాకు మెజవా ఓ ఫ్యాషన్ రంగ దిగ్గజం. 2019లో తన ఆన్ లైన్ ఫ్యాషన్ బిజినెస్ ను సాఫ్ట్ బ్యాంక్ కి అమ్మేశారు యుసాకు మెజవా. ప్రస్తుతం అతడి నికర సంపద విలువ 1.9 బిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్బ్ అంచనా చెబుతోంది.

ఇక, చంద్రుడిపైకి వెళ్లేందుకు కూడా మెజవా ఫ్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ‘డియర్ మూన్’ అని పేరు పెట్టారు. 2023లో ఈ మిషన్​ను చేపట్టనున్నారు. స్టార్ షిప్ రాకెట్​లో చంద్రుడి మీదకు వెళ్లే తొలి ప్రయాణికుడిగా మిజవా పేరును స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్ 2018లోనే ప్రకటించారు.

స్పేస్​ఎక్స్ స్టార్​షిప్ రాకెట్​లో చంద్రుడి మీదకు వెళ్లేందుకు ఎనిమిది మందిని ఆహ్వానించారు మెజవా. ఇందుకోసం ఓ కాంటెస్ట్ ప్రారంభించారు. పోటీలో గెలిచిన వారి యాత్రకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరించనున్నట్లు తెలిపారు. ఇందులో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఎంపిక ప్రక్రియ గురించి ఈ మెయిల్ వస్తుందని వివరించారు. అయితే,ఇది కనుక సాకారమైతే 1972 తర్వాత తొలి చంద్రుని యాత్రగా రికార్డుకెక్కనుంది.

ALSO READ Student’s Suicide Note : అమ్మాయిలకు రక్షణ ఆ రెండు చోట్ల మాత్రమే..విద్యార్థిని సూసైడ్ నోట్

ట్రెండింగ్ వార్తలు