jay bhattacharya
jay bhattacharya: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఈనెల ప్రారంభంలో ఎన్నికల ఫలితాలు వెల్లడయిన నాటినుంచి ట్రంప్ తన కార్యవర్గంలో ఒక్కొక్కరిని నియమించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులను పలు కీలక పదవుల్లో నియమించిన ట్రంప్.. తాజాగా మరో భారతీయ మూలాలున్న, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ అయిన జై భట్టాచార్యకు కీలక పదవి అప్పగించారు. అమెరికాలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)కు తదుపరి డైరెక్టర్ గా జై భట్టాచార్యను నియమిస్తూ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు.
Also Read: Israel: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని.. హెజ్బొల్లాకు వార్నింగ్.. ఎందుకంటే?
ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ‘జై భట్టాచార్యను ఎన్ఐహెచ్ డైరెక్టర్ గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ సహకారంతో భట్టాచార్య ఎన్ఐహెచ్ ను నడిపించడంతోపాటు దేశ ప్రజల ప్రాణాలను కాపాడే ముఖ్యమైన ఆవిష్కరణలు చేసేందుకు పనిచేస్తారు. అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చేందుకు వారిద్దరూ కృషి చేస్తారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్ఐహెచ్ డైరెక్టర్ గా నియామకం పట్ల జై భట్టాచార్య ఆనందం వ్యక్తం చేశారు. మేము అమెరికన్ శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యంగా మారుస్తామని తెలిపారు.
భట్టాచార్య స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆయన 1968లో భారతదేశంలోని కోల్‌కతాలో జన్మించారు. 1997లో స్టాన్ ఫోర్ట్ నుండి మెడిసిన్ లో డాక్టరేట్ పొందారు. మూడు సంవత్సరాల తరువాత అదే విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్ డీ చేశారు. కోవిడ్ సమయంలో జో బైడెన్ ప్రభుత్వ పాలసీని తీవ్రంగా విమర్శించిన భట్టాచార్య రిపబ్లికన్లకు దగ్గరయ్యారు.
ఇప్పటికే భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ట్రంప్ టీంలో ఎలాన్ మస్క్ తోపాటు డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) హెడ్ పదవికి ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా మరో భారతీయ మూలాలు కలిగిన భట్టాచార్యకు ట్రంప్ కీలక పదవి అప్పగించారు.