Justin Trudeau : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా..!

ప్రధాని ట్రూడో కొంత కాలంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.

Justin Trudeau

Justin Trudeau : ఎట్టకేలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మౌనం వీడారు. సస్పెన్స్ కు తెరదించారు. ప్రధాని పదవికి రాజీనామాపై ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రధాని పదవికి రిజైన్ చేయనున్నట్లు ట్రూడో ప్రకటించారు.

ప్రధానమంత్రి పదవికి, లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేయనున్నట్లు ట్రూడో అనౌన్స్ చేశారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగుతానని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ విషయంలో చాలా రోజులుగా ఉత్కంఠ నెలకొంది. పదవి నుంచి దిగిపోవాలని ట్రూడోపై ఒత్తిడి పెరిగింది.

Justin Trudeau

ట్రూడో పదవి నుంచి తప్పుకోవాలంటూ కొంత కాలంగా సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రూడో తన నిర్ణయాన్ని ప్రకటించారు. సుమారు దశాబ్దకాలంగా కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడోపై కొంత కాలంగా లిబరల్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ట్రూడో రాజీనామా చేయాలని సొంత పార్టీ నుంచే డిమాండ్లు వెల్లువెత్తాయి. మరోవైపు ట్రూడో హయాంలోనే భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

దేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రూడోకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని సర్వేలు తేల్చాయి. లిబరల్ పార్టీ కూడా ఇదే భావనలో ఉంది. దీంతో పార్టీ అధ్యక్ష, ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. కాగా, కెనడాలో భారత వ్యతిరేక శక్తులకు ట్రూడో ప్రభుత్వం సహకరిస్తోందనే ఆరోపణలు, తీవ్ర విరమ్శలు ఉన్నాయి.

Also Read : 2025లో ప్రపంచాన్ని కలవరపెడుతున్న 11 కొత్త రోగాలు ఏంటి? బాబా వంగా, నోస్ట్రడామస్‌ చెప్పిందే నిజం అవుతుందా?

తన రాజీనామాపై ట్రూడో ప్రకటన చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ”సెలవుల్లో నేను ఆలోచించుకోవడానికి సమయం దొరికింది. పార్టీ తన తదుపరి నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని నేను భావిస్తున్నా. నిన్న రాత్రి నేను లిబరల్ అధ్యక్షుడిని అడిగాను. కొత్త నాయకుడిని ఎన్నుకున్న వెంటనే పదవిని వదిలేస్తా. పార్టీ నేత ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని కోరాను” అని ట్రూడో తెలిపారు.

ప్రధాని ట్రూడో కొంత కాలంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. దేశంలో ఆహారం, గృహాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని ట్రూడో పై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ 16న ఆర్థిక మంత్రి ఆకస్మిక రాజీనామా చేశారు. ట్రూడో ప్రజాదరణ గణనీయంగా తగ్గింది. రాజకీయ సంక్షోభం కెనడాకు సవాల్ గా మారింది.

మాజీ ప్రధాన మంత్రి పియరీ ట్రూడో మొదటి సంతానమే ఈ ట్రూడో. వివిధ కెరీర్‌ల తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన రాజకీయ జీవితం 2008లో మాంట్రియల్ శ్రామిక-తరగతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యునిగా ప్రారంభమైంది. సెనేట్ సంస్కరణ, US వాణిజ్య ఒప్పందాన్ని చర్చించడం, ఉద్గారాలను తగ్గించడానికి కార్బన్ పన్నును అమలు చేయడం ట్రూడో విజయాలు. అదనంగా, అతను గంజాయిని చట్టబద్ధం చేశాడు.

Also Read : హష్ మనీ కేసులో ఏం జరగబోతోంది? ట్రంప్‌కు శిక్ష ఖాయమైతే జరిగేది ఏంటి?