Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ కు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాకున్నాడో మాకు తెలుసు అన్న ట్రంప్.. అతడిని చంపడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. కానీ, ఖమేనీని మేము ఇప్పుడే చంపాలని అనుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజలు, అమెరికా సైనికులకు హాని కలిగేలా మిస్సైల్స్ వేయాలని అనుకోవడం లేదన్నారు ట్రంప్. ఎంతో ఓపికతో వేచి చూస్తున్నామన్న ట్రంప్.. బేషరతుగా ఖమేనీ సరెండర్ కావాల్సిందేనని తేల్చి చెప్పారు.
”ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు కచ్చితంగా తెలుసు. ఆయన సులభమైన టార్గెట్. కానీ, ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నారు. ఇప్పుడైతే ఆయనను చంపబోము. ఇరాన్ పౌరులపైన లేదా అమెరికన్ సైనికులపైన క్షిపణులు ప్రయోగించాలని మేము కోరుకోవడం లేదు. మా ఓపిక నశించిపోతోంది. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే” అని తేల్చి చెప్పారు ట్రంప్.
జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన ట్రంప్.. హుటాహుటిన అమెరికాకు తిరిగి వెళ్లిపోయారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు తార స్థాయికి చేరుకోవడంతో, అత్యవసర జాతీయ భద్రతా చర్చల కోసం వాషింగ్టన్‌కు తిరిగి వెళ్లారు. ఇరాన్ సైనిక, అణు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వరుసగా ఐదవ రోజు క్షిపణి దాడులు చేసింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ వైఖరి చర్చకు దారితీసింది. అంతేకాదు.. టెహ్రాన్ లో ఉంటున్న పౌరులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ ఆదేశించడం సంచనలంగా మారింది. “ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు. నేను పదే పదే చెప్పాను. అందరూ వెంటనే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలి” అని ట్రంప్ ఆదేశించారు.