Iran Israel War: ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడి..! పశ్చిమాసియా వైపు కదులుతున్న అగ్రరాజ్యం యుద్ధ విమానాలు..!

జీ7 సదస్సు నుంచి డొనాల్డ్ ట్రంప్ హుటాహుటిన అమెరికాకు తిరుగు ప్రయాణం కావడం, వైట్ హౌస్ లో సిట్యుయేషన్ రూమ్ ఏర్పాటుకు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం..

Iran Israel War: ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడి..! పశ్చిమాసియా వైపు కదులుతున్న అగ్రరాజ్యం యుద్ధ విమానాలు..!

Donald Trump

Updated On : June 18, 2025 / 12:02 AM IST

Iran Israel War: ఇజ్రాయల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రం కానుందా? ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం కూడా దిగనుందా? ఏ క్షణమైనా ఇరాన్ పై అమెరికా దాడి చేయనుందా? ఇరాన్ అణు కేంద్రాలపై బాంబులు వేయనుందా? ఇప్పుడీ భయాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలవరపెడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయల్ పరస్పర దాడుల తర్వాత మంగళవారం జరిగిన కీలక పరిణామాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

జీ7 సదస్సు నుంచి డొనాల్డ్ ట్రంప్ హుటాహుటిన అమెరికాకు తిరుగు ప్రయాణం కావడం, వైట్ హౌస్ లో సిట్యుయేషన్ రూమ్ ఏర్పాటునకు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం, తక్షణమే పౌరులు టెహ్రాన్ ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించడం.. ఇవన్నీ చూస్తుంటే.. కచ్చితంగా ఏదో జరగబోతోంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అటు.. ఇజ్రాయల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం అవుతున్న తరుణంలో.. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు పశ్చిమాసియా వైపు కదులుతున్నాయి. దీంతో ఇరాన్ పై ఏ క్షణమైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇజ్రాయల్ ఇరాన్ మధ్య యుద్ధం ఉధృతంగా సాగుతున్న తరుణంలో ఆ ప్రాంతంలో అమెరికా సైనిక దళాలను బలోపేతం చేస్తూ అమెరికా సైన్యం మధ్యప్రాచ్యానికి యుద్ధ విమానాల మోహరింపును విస్తరిస్తోంది. F-16, F-22, F-35 యుద్ధ విమానాలను మోహరిస్తోంది. రక్షణలో భాగంగా డ్రోన్లు, ప్రొజెక్టైల్స్ ను కూల్చివేసేందుకు ఉపయోగించే యుద్ధ విమానాలను మోహరిస్తోంది అమెరికా. బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసే సామర్థ్యం ఉన్న నేవీ యుద్ధ నౌకలను తూర్పు మధ్యధరా ప్రాంతంలో మోహరించే అవకాశాన్ని సైతం అగ్రరాజ్యం పరిశీలిస్తోంది.

అమెరికా ఇప్పటికే మధ్యప్రాచ్యంలో గణనీయమైన బలగాలను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 40,000 మంది సైనికులు ఉన్నారు. వీటిలో వైమానిక రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమానాలు, శత్రు క్షిపణులను గుర్తించి కూల్చివేయగల యుద్ధనౌకలు ఉన్నాయి. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉందని తేల్చిన తర్వాత, ఇజ్రాయెల్ వైమానిక యుద్ధాన్ని ప్రారంభించింది.

ఇరాన్, ఇజ్రాయల్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న వేళ.. జీ7 సదస్సు నుంచి ఉన్న పళంగా ట్రంప్ వైట్ హౌస్ కి తిరిగి వెళ్లిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రంప్ ఏం చేయబోతున్నారు? అనేది ఉత్కంఠగా మారింది. భీకర యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతారా? లేక మరింత ఆజ్యం పోస్తారా? అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. వైట్ హౌస్ లో సిట్యుయేషన్ రూమ్ ఏర్పాటు చేసిన ట్రంప్.. ఇజ్రాయల్, ఇరాన్ మధ్య చర్చలతో యుద్ధానికి బ్రేక్ వేస్తారని అంతా అనుకుంటున్నారు.

అయితే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను ఆపితేనే ఇది సాధ్యం. లేదంటే ఇజ్రాయల్ తన దాడులను కంటిన్యూ చేయొచ్చు. దానికి ట్రంప్ మరింత మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్ లోని న్యూక్లియర్ ప్లాంట్ ను (ఫోర్డో బంకర్) ధ్వంసం చేసేందుకు అమెరికా సాయం కోరింది ఇజ్రాయల్. ఇప్పుడు ఇరాన్ స్పందించే విధానంపైనే అమెరికా యాక్షన్ ప్లాన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇరాన్ దారికి రాకుండా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని చూస్తే.. అది ఆ దేశానికి తీవ్ర నష్టం అని ఇరాన్ ప్రతినిధులతో ట్రంప్ చర్చలు జరపనున్నట్లు సమాచారం.

Also Read: స్పాంజ్ బాంబ్.. ఇజ్రాయల్ కొత్త రహస్య ఆయుధం.. ఇది ఎంత డేంజరస్ అంటే..

ఇజ్రాయెల్, ఇరాన్ వార్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఇప్పటికే న్యూక్లియర్ ప్లాంట్ ను ధ్వంసం చేసి ఇరాన్ కు షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్ లోని ఫోర్డో అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై గురి పెట్టింది. అయితే అదంత ఈజీ కాదు. దీంతో ఆ పని చేయాలని అమెరికాను కోరింది ఇజ్రాయెల్. GBU-57 బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ నిర్వహిస్తున్న ఫోర్డో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను పేల్చేయాలని అమెరికాపై ఒత్తిడి పెంచుతోంది. ఇరాన్ లోని ఫోర్డో న్యూక్లియర్ కాంప్లెక్స్ అణ్వాయుధాలు యురేనియం శుద్ధికి చాలా కీలకమైనవి. పర్వత ప్రాంతాల్లోని సొరంగాల్లో బంకర్లను ఏర్పాటు చేసుకుని రహస్యంగా న్యూక్లియర్ కాంప్లెక్స్ నిర్వహిస్తోంది ఇరాన్.

సాధారణ బాంబులు, మిస్సైళ్లతో దీన్ని ధ్వంసం చేయడం కష్టం. అందుకే కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉన్న జీబీయు-57 బంకర్ బస్టర్ బాంబులతో ఈ ప్రాంతాన్ని మొత్తం సమూలంగా నాశనం చేయాలన్నది ఇజ్రాయల్ ప్లాన్. ఇజ్రాయెల్ చేస్తున్న ఒత్తిడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన ట్రంప్ హఠాత్తుగా అమెరికాకు తిరుగు ప్రయాణం అయ్యారు. అంతేకాదు వైట్ హౌస్ లో సిటుయేషన్ రూమ్ ఏర్పాటు కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. న్యూక్లియర్ కాంప్లెక్స్ ఉన్న ఫోర్డో బంకర్లను పేల్చాలంటే ఇజ్రాయల్ దగ్గరున్న ఆయుధాల వల్ల కాదు. కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉన్న జీబీయు-57 బంకర్ బస్టర్ బాంబులను వాడాలనుకుంటోంది.