శని ఉపగ్రహంపై అతిపెద్ద సముద్రం..లోతు ఎంతో తెలుసా

శని ఉపగ్రహంపై అతిపెద్ద సముద్రం..లోతు ఎంతో తెలుసా

Updated On : January 31, 2021 / 6:51 PM IST

Largest sea శని గ్రహానికి ఉన్న 82 ఉపగ్రహాల్లో ఒకటైన టైటాన్‌పై ఉన్న అతిపెద్ద సముద్రం లోతు 1000 అడుగులకు పైగానే ఉన్నట్లు ఆస్ట్రోరోమర్స్(ఖగోళ శాస్త్రవేత్తలు)అంచనావేశారు. టైటాన్‌ ఉత్తర ధృవం వద్ద ఉన్న ఈ సముద్ర విస్తీర్ణం దాదాపు 1.54 లక్షల చదరపు మైళ్లు.

భూమిపై ఉన్న కాస్పియన్‌ సముద్రం కన్నా ఇది పెద్దది. ఇందులో ద్రవరూపం లో ఉండే ఈథేన్, మీథేన్‌ ఇతర హైడ్రోకార్బన్లున్నాయి. ఇవన్నీ జీవి పుట్టుకకు మూలపదార్ధాలుగా ఉపయోగపడేవి కావడం గమనార్హం. 1997లో నాసా పంపిన కసిని స్పేస్‌ ప్రోబ్‌ టైటాన్‌పై ఈ సముద్రాన్ని గుర్తించింది. 2008లో ఈ సముద్రానికి క్రాకెన్‌ మారె అని పేరుపెట్టారు. ఈ సముద్రం మధ్యలో మైడా ఇన్సులా అనే ద్వీపం కూడా ఉంది.

కాగా, టైటాన్ ఉపగ్రహానికి పలు ప్రత్యేకతలున్నాయి. టైటాన్‌పై భూమి తొలినాళ్లలో ఉన్న వాతావరణం ఉందని సీసీఏపీఎస్‌ సంస్థ తెలిపింది. భవిష్యత్‌లో జీవ ఆవిర్భావానికి ఈ గ్రహంపై అనుకూలతలు ఎక్కువని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుంటారు. జీవావిర్భివానికి సంబంధించిన అవకాశాల గురించి టైటాన్‌పై అతిపెద్ద సముద్రం క్రాకెన్‌ మారెపై సైంటిస్టులు పరిశోధన జరుపుతున్నారు. ఈ పరిశోధనల్లో ఈ సముద్ర కేంద్రం వద్ద వెయ్యి అడుగుల లోతు ఉంటుందని తేలింది. ఇంతవరకు దీని లోతు 300 అడుగులేనని భావించారు. . ఈ సముద్రం లోతు తెలియడంతో ఈ దఫా పరిశోధనల్లో సముద్ర అంతర్భాగంలో తిరిగే విధంగా ఓ రోబోటిక్‌ సబ్‌మెరైన్‌ పంపి ప్రయోగాలు చేయవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.