వామ్మో..బావిపైనే కట్టిన ఇల్లు..పడిన తరువాత గానీ తెలియలేదు పాపం

  • Publish Date - July 2, 2020 / 11:34 AM IST

ఎవరైనా ఇల్లు కట్టుకున్నాక బావి తవ్వుకుంటారు.లేదంటే ఇల్లు కట్టుకోవటానికి నీరు అవసరం కాబట్టి ముందే బావి తవ్వుకుంటారు.కానీ అమెరికాలోని కనెక్టికట్‌లో ఏకంగా బావిపైనే ఓ ఇల్లు కట్టేశారు. కానీ పాపం ఆ ఇంటిలోఉండేవాళ్లకు మాత్రం తాము ఉంటున్నఇల్లు బావిపైనే కట్టిందని తెలియదు. ఈ విషయం ఆ బావిలో పడేవరకు ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా తెలియకపోవడం గమనించాల్సిన విషయం.

వివరాల్లోకి వెళితే..కనెక్టికట్‌లోని ఆ ఇంట్లో ఉండే వ్యక్తి తన ఇంటికి వచ్చిన గెస్ట్ కోసం సామాన్లు సర్ధుతుండగా అనుకోకుండా ఫ్లోర్ విరిగి కిందకు కూలిపోయింది. ఫ్లోర్ విరిగితే కింద ఉన్న నేలమీద పడాలి.కానీ ఏకంగా 30 అడుగుల లోతులో పడిపోయాడు. అంత ఎత్తునుంచి పడిపోవటంతో అతనికి దెబ్బలు తగిలాయి.తరువాత కొంచెంసేపటికి తేరుకొని చుట్టూ పరికించి చూడగా అదొక బావి అని తెలిసింది. అదేంటి ఇంటి ఫ్లోర్ కూలిపడిపోతే బావిలోకెలా వచ్చాను అనుకుని ఆశ్చర్యపోయాడు. ఆ బావిలో ఆరు అడుగుల లోతు నీళ్లుకూడా ఉండటం మరో విశేషం.

అదృష్టవశాత్తు పడ్డప్పుడు అతడి జేబులో మొబైల్ ఫోన్ ఉండటంతో వెంటనే గిలీఫోర్డ్ పోలీసులకు ఫోన్ చేసి నేను బావిలో పడిపోయాను నన్ను కాపాడండి అంటూ చెప్పాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సహా ఆ ఇంటికి వచ్చిన పోలీసులకు అక్కడ ఏబావి కనిపించలేదు. దీంతో పోలీసులు మళ్లీ అతనికే ఫోన్ చేశారు.

దానికి అతను ఇంటి లోపలికి రమ్మన్నాడు. ఇదేంటి బావిలో పడ్డాను అంటాడు..ఇంటిలోకి రమ్మంటాడేంటీ అనుకుంటూ పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ బావి ఉంది. వెంటనే బావిలో పడినతన్ని జాగ్రత్తగా తాడు సహాయంతో ఒకరు లోపలికి దిగి అతనిని సురక్షితంగా పైకి లాగారు.

ఎక్కువ సేపు చల్లని నీళ్లలో…ఉండటంత అతను కాస్త అస్వస్థతకు గురయ్యాడు. ఇంట్లో అంత పెద్ద బావి ఎలా వచ్చిందని పోలీసులు ఆరా తీశారు. అప్పుడు అసలు నిజం బయటపడింది. ఆ భవనాన్ని 1843లో నిర్మించారని, అప్పుడు ఆ బావి ఇంటికి బయటే ఉండేదని తెలిసింది. 1981లో ఆ ఇంటికి మరమ్మతులు చేశారు. బావిని పూడ్చకుండా సాధారణ చెక్క ఫ్లోరుతో ఇల్లు కట్టేశారని తేలింది.

Read:ఆ ఆస్పత్రిలో చైనాలో తయారు చేయని టీవీని పెట్టండి : హైకోర్టు ఆదేశం