×
Ad

US Green Card: ట్రంప్ ఇంకో దెబ్బ.. పెళ్లి చేసుకున్నంత మాత్రాన గ్రీన్ కార్డ్ వస్తుందన్న గ్యారెంటీ లేదు..!

ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో వివాహ ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తులను మరింత నిశితంగా పరిశీలిస్తున్నారు.

US Green Card Representative Image (Image Credit To Original Source)

  • వలసదారులకు ట్రంప్ మరో షాక్
  • గ్రీన్ కార్డ్ పొందడం ఇక అంత ఈజీ కాదు
  • అమెరికన్ సిటిజన్‌ని వివాహం చేసుకున్న మాత్రాన గ్రీన్ కార్డ్ ఇచ్చేయరు
  • వీసా నిబంధనలు మరింత కఠినతరం

US Green Card: గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాస పత్రం). అమెరికాలో శాశ్వత నివాసం కోసం వలసదారులకు ఇది చాలా కీలకం. ఈ అనుమతి పత్రం ఉంటేనే అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉంది. గ్రీన్ కార్డ్ హోల్డర్లు పూర్తి స్థాయి అమెరికన్ పౌరులతో సమానం కానప్పటికీ, వారు అదే విధమైన అనేక హక్కులను అనుభవిస్తారు. గ్రీన్ కార్డ్ పొందడానికి సాధారణంగా ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి అమెరికన్ పౌరుడిని వివాహం చేసుకోవడం. అయితే, అమెరికన్ పౌరుడిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇప్పుడు గ్రీన్ కార్డ్ లభిస్తుందనే హామీ లేదనే వార్త ఆందోళనకు గురి చేస్తోంది.

అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకారం US పౌరుడి జీవిత భాగస్వామి “US పౌరుడి తక్షణ బంధువు” వర్గంలోకి వస్తారు. అమెరికా చట్టం ప్రకారం, అమెరికన్ పౌరుల భర్తలు, భార్యలతో సహా తక్షణ బంధువులు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, కేవలం వివాహం ఇకపై గ్రీన్ కార్డ్‌లకు హామీ ఇవ్వదని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్న్‌స్టెయిన్ హెచ్చరించారు. గ్రీన్ కార్డ్ పొందాలంటే ఆ వివాహం నిజమైనదని వారు ఇమ్మిగ్రేషన్ అధికారులను ఒప్పించాల్సి ఉంటుందన్నారు.

ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో వివాహ ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తులను మరింత నిశితంగా పరిశీలిస్తున్నారు. పెళ్లి కేవలం కాగితంపై చట్టబద్ధంగా కాకుండా నిజమైనదా కాదా అనే దానిపై అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల ట్రంప్ సర్కార్ డైవర్సిటీ వీసా (DV) లాటరీ ప్రక్రియను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. డైవర్సిటీ వీసా కింద.. అమెరికాకు తక్కువ స్థాయిలో వలసలు ఉన్న దేశాల ప్రజలకు ర్యాండమ్ సెలక్షన్ ద్వారా ప్రతి సంవత్సరం 50వేల వరకు వలసదారుల వీసాలు అందేవి.

“రిలేషన్ షిప్ లో ఉన్నంత మాత్రాన మీకు గ్రీన్ కార్డ్ రాదు. కలిసి జీవించడం వల్ల మాత్రమే గ్రీన్ కార్డ్ వస్తుంది” అని 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న స్పార్ అండ్ బెర్న్‌స్టెయిన్ లా ఆఫీసెస్‌లోని న్యాయ బృందంలో భాగమైన బ్రాడ్ బెర్న్‌స్టెయిన్ అన్నారు. విడిగా నివసించే వివాహిత జంటల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని బ్రాడ్ బెర్న్‌స్టెయిన్ హెచ్చరించారు. “భార్యాభర్తలు ఒకే ఇంట్లో నివసించకపోతే, వారి గ్రీన్ కార్డ్ కేసు ఇప్పటికే పతనమవుతున్నట్లే” అని అన్నారు.

నిజంగా కలిసున్నారా లేదా అనేదే ముఖ్యం..

”వివాహ సంబంధ కేసుల్లో మీరు ఎందుకు విడివిడిగా నివసిస్తున్నారనే దాని గురించి ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టించుకోరు. అది ఉద్యోగం, చదువు, డబ్బు లేదా సౌకర్యం కోసం అయినా సరే వారు లెక్కచేయరు. కలిసి నివసించడమే కీలక అంశం. మీరు భార్యాభర్తలుగా నిజంగా కలిసి నివసిస్తున్నారా లేదా అనే దాని గురించి మాత్రమే అధికారులు పట్టించుకుంటారు” అని ఆయన తేల్చి చెప్పారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, ప్రతిరోజూ ఒకే ఇంట్లో కలిసి నివసించే దంపతులదే నిజమైన వివాహంగా పరిగణిస్తారని ఆయన అన్నారు.

“కాబట్టి, మీరు ప్రతిరోజూ ఒకే ఇంట్లో నివసించకపోతే, ఇమ్మిగ్రేషన్ అధికారులు మీ వివాహంపై ప్రశ్నలు వేయడం ప్రారంభిస్తారు. వారు ప్రశ్నించడం మొదలుపెడితే దర్యాప్తు చేస్తారు. మీకు గ్రీన్ కార్డ్ ఇవ్వకుండా తిరస్కరించడానికే చూస్తారు. కాబట్టి, మీకు వివాహం ద్వారా గ్రీన్ కార్డ్ కావాలంటే, మీరు కలిసి జీవించాలి. అంతే” అని స్పష్టం చేశారు.

US Green Card Rules Representative Image (Image Credit To Original Source)

విడిగా జీవించడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే..

”విడిగా జీవించడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే. దర్యాప్తు ఎదుర్కోవాల్సిందే. మీరు వివాహం చేసుకుని పూర్తి సమయం కలిసి జీవించకపోతే, మీరు ఏదైనా దాఖలు చేసే ముందు మీకు లీగల్ గైడెన్స్ అవసరం” అని బెర్న్‌స్టెయిన్ అన్నారు. యూఎస్ పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కేవలం చిరునామాలపై మాత్రమే ఆధారపడదు. వివాహం కేవలం ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసమే జరిగిందా లేక సదుద్దేశంతో జరిగిందా అని నిర్ధారించుకుంటుంది” అని వివరించారు. దంపతుల మధ్య విశ్వాసం లేకపోయినా, జీవిత భాగస్వాములుగా కలిసి జీవించాలనే ఉద్దేశ్యం లేకపోయినా, వలస చట్టాలను దాటవేయాలనే ఉద్దేశ్యం ఉంటే ఆ వివాహం తిరస్కరించబడుతుందని USCIS పేర్కొంది.

ట్రంప్ వచ్చాక అమెరికాలోకి వలసలను అరికట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ వంటి కీలక మార్గాలను కఠినతరం చేస్తున్నారు. యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్.. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు వర్క్ పర్మిట్ల వ్యవధిని 18 నెలలకు తగ్గించింది.

“ఆందోళనకరమైన దేశాలు”గా వర్గీకరించబడిన 19 దేశాల నుండి శాశ్వత నివాసితులు కలిగున్న అన్ని గ్రీన్ కార్డులను సమగ్రంగా సమీక్షించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. వాషింగ్టన్, డిసిలో ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బంది హత్య.. బ్రౌన్ యూనివర్సిటీలో సామూహిక కాల్పుల ఘటనల తర్వాత ట్రంప్ కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనల వెనుక గ్రీన్ కార్డులు కలిగున్న వలసదారులు ఉండటమే దీనికి కారణం.

Also Read: మరో హిందూ వ్యక్తికి నిప్పంటించారు.. బంగ్లాదేశ్‌లో అసలు హిందువులను ఎందుకు చంపుతున్నారు?