మరో హిందూ వ్యక్తికి నిప్పంటించారు.. బంగ్లాదేశ్‌లో అసలు హిందువులను ఎందుకు చంపుతున్నారు?

పోలీసుల దర్యాప్తుల ప్రకారం.. ఆగస్టు 5 నుంచి 20 మధ్య మైనారిటీలపై నమోదైన దాడి కేసుల్లో 98.4 శాతం రాజకీయ కారణాల వల్ల జరిగినవిగా తేలాయి.

మరో హిందూ వ్యక్తికి నిప్పంటించారు.. బంగ్లాదేశ్‌లో అసలు హిందువులను ఎందుకు చంపుతున్నారు?

Bangladesh Hindus (Image Credit To Original Source)

Updated On : January 1, 2026 / 8:14 PM IST
  • 1947 నుంచి హిందూ వ్యతిరేక భావజాలం
  • 2024లోనూ బంగ్లాలో హిందువుల హత్యలు
  • ఆ హత్యల వెనుక మత కారణాలు లేవన్న నేత్ర న్యూస్ 

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తిపై మూకదాడి జరిగింది. ఖోకన్ దాస్ (50) అనే వ్యక్తిని కత్తితో పొడిచి, కొట్టి, పెట్రోల్‌ పోసి నిప్పంటించారు ఆందోళనకారులు. ఖోకన్‌ దాస్ సమీపంలోని చెరువులోకి దూకడం వల్ల బతికాడు.

అతడికి ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స అందుతోంది. ఈ ఘటన షరియత్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు, వారిపై హింసకు కారణం కేవలం మత తీవ్రవాదమే కాదు. రాజకీయాలు, స్థానికంగా ఉన్న పలు వివాదాలు వంటి అంశాలు కూడా కారణాలుగా ఉన్నాయి. అల్పసంఖ్యాక వర్గాలపై వివక్ష ఎంతగా ఉందో ఈ దాడులు ప్రతిబింబిస్తున్నాయి. హింసకు కారణమవుతున్న ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం..

రాజకీయ అస్థిరత
రాజకీయంగా ఎదగడానికి కొందరు నాయకులు మైనార్టీలను బలిపశువులుగా మార్చుతున్నారు. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పులు, త్వరలో జరగాల్సిన ఎన్నికలు హింసను రాజేస్తున్నాయి.

బంగ్లాదేశ్‌లోని అవామీ లీగ్ పార్టీకి హిందువులను ఓటు బ్యాంక్‌గా ఇతర పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయకుండా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం విధించారు.

రాజకీయ అశాంతి నెలకొన్న వేళ ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, అతి తీవ్రవాద గ్రూపులు హిందులను లక్ష్యంగా చేసుకుంటున్నాయన్న వాదనలు ఉన్నాయి. 2024 ఆగస్టులో అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, ఆలయాలపై దాడులు పెరిగాయి.

Also Read: గుడ్‌న్యూస్‌.. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసులు షురూ.. రూట్లు, టికెట్‌ ఛార్జీల వివరాలు ఇవే..

మత తీవ్రవాదం, హిందూ వ్యతిరేక భావజాలం
కొంతమంది అతి తీవ్రవాద వర్గాల నుంచి హిందూ వ్యతిరేక భావాలు నిరంతరం కొనసాగుతున్నాయి. దైవదూషణ ఆరోపణలు, సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలు చేశారన్న తప్పుడు ఆరోపణలు చేస్తూ హిందువులపై తరచూ దాడులు చేస్తున్నారు. ఆందోళనకారులను సమీకరించి సామూహిక దాడులకు మతవాదులు ప్రేరేపిస్తున్నారు.

చారిత్రక నేపథ్యం
భారత్ విభజన కాలం (1947లో) నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై వేధింపులు కొనసాగుతూ వచ్చాయి. బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా భారీగా తగ్గడానికి ఇది కారణమైంది. 1971 బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధం సమయంలో ఆ దేశంలో కొందరికి హిందువులే లక్ష్యంగా మారారు.

భారత మద్దతుదారులు అన్న భావన
బంగ్లాదేశ్‌లోని హిందువులపై కొందరు భారత మద్దతుదారులన్న ముద్రవేశారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు హిందువుల్లో అభద్రత భావనను మరింత పెంచాయి.

మానవ హక్కుల సంస్థలు ఏమంటున్నాయి?
హింస నుంచి మైనార్టీలను రక్షించడంలో బంగ్లాదేశ్‌ (ప్రభుత్వం) తన బాధ్యతను అంతగా నిర్వర్తించలేదని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి.

మతం వల్ల కాదు.. రాజకీయాల వల్లే: మీడియా
ఆందోళనకారులు 2025 మేలో ఒక వ్యక్తిని కొట్టిన వీడియోను హిందూ వ్యాపారిపై సామూహిక దాడిగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. అంతర్జాతీయ మీడియా సంస్థల ఫ్యాక్ట్ చెకర్లు ఆ వీడియో ఏప్రిల్ నెలకు చెందినదని నిర్ధారించారు. ఆ వ్యక్తి ముస్లిం అని, అతడు దోపిడీ చేస్తుండగా స్థానికులు పట్టుకుని కొట్టినట్టు తెలిపారు.

మరోవైపు, 2024 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్యత మండలి తొమ్మిది మంది హిందూ పురుషుల హత్యలు హిందూ వ్యతిరేక భావజాలం వల్లే జరిగాయని చెప్పింది. అయితే, ఈ కేసులకు సంబంధించిన పత్రాల ఆధారంగా నేత్ర న్యూస్ పరిశోధన జరిపి ఆ హత్యల వెనుక మత కారణాలు లేవని పేర్కొంది.

నేత్ర న్యూస్ అంటే బంగ్లాదేశ్‌కు చెందిన స్వతంత్ర దర్యాప్తు వార్తా సంస్థ. స్వీడెన్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంటుంది. పోలీసుల దర్యాప్తుల ప్రకారం.. ఆగస్టు 5 నుంచి 20 మధ్య మైనారిటీలపై నమోదైన దాడి కేసుల్లో 98.4 శాతం రాజకీయ కారణాల వల్ల జరిగినవిగా తేలాయి.