Fire In Nightclub : యూరప్ లోని నార్త్ మెసిడోనియాలోని నైట్ క్లబ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 59 మంది చనిపోయారు. 150 మందికిపైగా గాయపడ్డారు. నార్త్ మెసిడోనియా రాజధాని స్కోప్జేకు 100 కిలోమీటర్ల దూరంలో కొకాని పట్టణంలో క్లబ్ పల్స్ ఉంది. ఈ క్లబ్ లో నైట్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో 1500 మంది పాల్గొన్నారు. మండే స్వభావం ఉన్న వస్తువుల వల్ల సీలింగ్ కు నిప్పు అంటుకుని మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న వారు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. వీలైనంత త్వరగా బయటకు వెళ్లిపోవాలని అక్కడి సిబ్బంది చెప్పారు. ఈ ఘోర అగ్నిప్రమాదం సుమారు 150 కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. తమ వారిని కోల్పోయి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన ఒక్కగానొక్క కుమారుడు మంటల్లో చిక్కుకుని చనిపోయాడని ఓ తండ్రి బోరున విలపించాడు. నా కొడుకు లేకుండా నేను ఉండలేను, నాకీ జీవితం వద్దు అంటూ రోదించాడు.
ఈ అగ్నిప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వాలంటీర్లను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు. 118 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ హెల్త్ మినిస్టర్ అర్బెన్ తరవారి తెలిపారు. పొరుగు దేశాలైన అల్బేనియా, బల్గేరియా, గ్రీస్, సెర్బియా.. సాయం చేసేందుకు ముందుకొచ్చాయన ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు.
Also Read : అంత ఈజీ కాదు.. భూమి మీదకు వస్తున్న సునీతా విలియమ్స్ ఈ సమస్యలతో బాధపడవచ్చు..
”బాధితుల ప్రాణాలు కాపాడేందుకు సర్వ శక్తుల ప్రయత్నాలు చేస్తున్నాం. బాధితుల్లో చాలా మంది యువత ఉండటం విషాదకరం. దేశ చరిత్రలోనే ఇది అత్యంత విషాదకర ఘటన” అని ఆరోగ్యశాఖ మంత్రి అన్నారు. నార్త్ మెసిడోనియా దేశ జనాభా 20 లక్షలు. దేశ రాజధాని స్కోప్జేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అగ్నిప్రమాద బాధితులను దేశ ప్రధాని గోర్డానా దవకోవా పరామర్శించారు.
”ఇది చాలా ఘోరం, దురదృష్టకరం. బాధిత యువతలో ధైర్యాన్ని నింపాల్సిన సమయం” అని ప్రధాని ఎమోషన్ అయ్యారు. మాసిడోనియాకు ఇది చాలా కష్టమైన, విచారకరమైన రోజు. చాలా మంది యువకులు మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలకు జరిగిన నష్టం పూడ్చలేనిది” అని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
అగ్నిప్రమాద బాధిత కుటుంబసభ్యులు ఆసుపత్రులకు క్యూ కట్టారు. చికిత్స పొందుతున్న తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. తమ పిల్లలు ప్రాణాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అగ్నిప్రమాదంలో భవనం పైకప్పు పాక్షికంగా కూలిపోయింది. చెక్క దూలాలు, శిథిలాల అవశేషాలు మిగిలాయి.
Also Read : పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి, 90మంది సైనికులు మృతి?
మరోవైపు నైట్ క్లబ్ లో పాటిస్తున్న భద్రతా నిబంధనలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. అసలేం జరిగింది? మంటలు ఎలా చెలరేగాయి? అనేది తెలుసుకునే పనిలో పడింది. దీనికి బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని అధికారులు చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడిని విచారిస్తున్నారు.
కాగా, 2015లో రొమేనియాలోని బుకారెస్ట్‌లోని కోలెక్టివ్ నైట్ క్లబ్‌లోనూ ఇలాంటి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 64 మంది మరణించారు. మండే స్వభావం గల వస్తువుల వల్లే ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.