Sunita Williams: అంత ఈజీ కాదు.. భూమి మీదకు వస్తున్న సునీత విలియమ్స్ ఈ సమస్యలతో బాధపడవచ్చు..
మాజీ వ్యోమగామి టెర్రీ విర్ట్స్ 2014, నవంబర్ 23న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లారు. ఆయన 2015 జూన్ 11న భూమి మీదకు తిరిగి వచ్చారు. దాదాపు 200 రోజులకు పైగా అక్కడే ఉన్నారు. అప్పట్లో ఆయనకు సమస్యలు..

Sunita Williams
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకు రానున్నారు. దాదాపు తొమ్మిది నెలల పాటు ఐఎస్‌ఎస్‌లో ఉన్న వారిద్దరు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది.
సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో ఉండడం, గురుత్వాకర్షణ లేని ప్రాంతంలో ఉండడం వల్ల అనేక శారీరక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
మాజీ వ్యోమగామి టెర్రీ విర్ట్స్ దీనిపై స్పందిస్తూ.. తాను గతంలో సుదీర్ఘకాలం పాటు ఐఎస్‌ఎస్‌లో ఉండి తిరిగి భూమిపైకి రావడం వల్ల అప్పట్లో తనకు ఫ్లూ ఉన్నట్లు అనిపించిందని చెప్పారు. తనలో తల తిరుగుతున్నట్లు లక్షణాలు కనపడ్డాయని, పూర్తిగా కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పట్టిందని చెప్పారు. దీన్ని బట్టి సునీత విలియమ్స్ కూడా ఈ లక్షణాలతో బాధపడే అవకాశం ఉంది.
మాజీ వ్యోమగామి టెర్రీ విర్ట్స్ 2014, నవంబర్ 23న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లారు. ఆయన 2015 జూన్ 11న భూమి మీదకు తిరిగి వచ్చారు. దాదాపు 200 రోజులకు పైగా అక్కడే ఉన్నారు. ఇప్పుడు సునీత విలియమ్స్ దాదాపు 320 రోజులకు పైగా అక్కడే ఉంటున్నారు.
నడిచేందుకు ఇబ్బందులు
నాసా మాజీ వ్యోమగామి లెరోయ్ చియావో కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ.. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు తిరిగి వచ్చిన తర్వాత నడిచేందుకు ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పారు.
వారిద్దరు “బేబీ ఫీట్”ను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. “బేబీ ఫీట్” అంటే స్పేస్‌లో చాలా కాలం పాటు ఉన్న తర్వాత వ్యోమగాముల పాదాల్లో ఏర్పడే సాప్ట్, స్మూత్ కండీషన్. అంటే వ్యోమగాములు అంతరిక్షంలో నడవరు కాబట్టి, వారి పాదాలపై కాలిస్ అదృశ్యమవుతాయి.
కాలిస్ అంటే పాదాలపై ఉండే మందపాటి చర్మం. వారు భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు వారి పాదాలు శిశువుల పాదాలలా మృదువుగా ఉంటాయి. దీంతో వారు నడవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఎముకలు, గుండె, మెదడు సంబంధిత సమస్యలు
అలాగే, నాసా చెప్పిన వివరాల ప్రకారం ఎముకల సాంద్రత, కండరాల క్షీణత వంటి సమస్యలను కూడా సునీత విలియ్స్, విల్మోర్ ఎదుర్కొనే అవకాశం ఉంది. దీంతో వీరిద్దరు వ్యాయామాలు, ఇతర జాగ్రత్తలు తీసుకోకపోతే వారు మరిన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతరిక్షంలో ఎముకల కణజాలాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
అంతరిక్షంలో ప్రతి నెలా వ్యోమగామి ఎముకలు ఒక శాతం చొప్పున సాంద్రతను కోల్పోతాయి. ఇవి బలహీనంగా, పెళుసులుగా మారతాయి. దాదాపు తొమ్మిది నెలల తర్వాత విలియమ్స్, విల్మోర్ తిరిగి వస్తుండడంతో ఈ సమస్యలనూ ఎదుర్కోవలసి ఉంటుంది.
అంతరిక్షంలో సుదీర్ఘకాలం ఉండడంతో ఆ పరిస్థితులు వ్యోమగాముల గుండె, మెదడు, రక్త ప్రసరణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయి. మెదడులో ద్రవం పెరుగుదల వల్ల వినికిడి, దృష్టి లోపాలు కూడా తలెత్తవచ్చు. ఇది సెరిబ్రల్ ఎడెమాకు దారితీస్తుంది. మెదడుపై ఒత్తిడి పెరగడం, స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో-ఓక్యులర్ సిండ్రోమ్ వ్యాధి కూడా రావచ్చు. వ్యోమగాములపై రేడియేషన్ ప్రభావం వల్ల క్యాన్సర్, కేంద్ర నాడీ వ్యవస్థ సంబంధింత సమస్యలు కూడా తలెత్తవచ్చు.