Gold: పెళ్లిళ్ల సీజన్.. ఐతే ఏంటి? అంటున్న బంగారం కొనుగోలుదారులు.. పసిడి కొనుగోళ్లు ఢమాల్.. ఎందుకంటే?

ఇటీవలి కాలంలో పెళ్లిళ్ల సమయంలోనూ బంగారం కొనుగోలుపై చాలా మంది ఆసక్తి చూపడంలేదు.

Gold: పెళ్లిళ్ల సీజన్.. ఐతే ఏంటి? అంటున్న బంగారం కొనుగోలుదారులు.. పసిడి కొనుగోళ్లు ఢమాల్.. ఎందుకంటే?

Gold And Silver Price

Updated On : March 16, 2025 / 4:32 PM IST

భారతీయ సంస్కృతిలో పసిడి భాగమైపోయింది. పెళ్లిళ్లలో దాని వినియోగం ప్రాచీనకాలం నుంచి ఉంది. వేడుకల్లో బంగారం పెట్టడం, ఆభరణాలు ధరించడం అతి ముఖ్యమైన సంప్రదాయంగా ఉంది.

వధువు పుట్టింటి నుంచి మెట్టినింట్లో అడుగు పెట్టేవేళ ఆమెకు తల్లిదండ్రులు బంగారం పెడతారు. పెళ్లి సమయంలో వధువుకి బంగారాన్ని ఇస్తే భవిష్యత్తులో ఆమె ఆర్థిక భద్రతకు ఉపయోపడుతుందని ఆమె తల్లిదండ్రులు భావిస్తారు.

వరకట్నంగానూ వరుడి కుటుంబం బంగారాన్ని స్వీకరిస్తుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. పెళ్లిళ్లలో బంగారం పెట్టడాన్ని ప్రతిష్ఠగానూ చాలా మంది భావిస్తారు. అయితే, ఇటీవలి కాలంలో బంగారం ధరలు బాగా పెరిగిపోవడంతో ఈ సాంప్రదాయానికి వధువు కుటుంబం కాస్త దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

Also Read: పద్మ అవార్డులకు ఎలా అప్లై చేసుకోవాలి.. మీ పేరును మీరే ఇలా నామినేట్ చేసుకోండి?

పెళ్లిళ్ల సీజన్.. అయినా బంగారం వద్దులే..
ఇటీవలి కాలంలో పెళ్లిళ్ల సమయంలోనూ బంగారం కొనుగోలుపై చాలా మంది ఆసక్తి చూపడంలేదు. బంగారం రేట్లు పెరగడంతో సామాన్యుల ఇంట్లో పెళ్లిళ్లకు 4-6 తులాల బంగారం పెట్టడమే గగనంగా మారుతోంది.

పసిడికి బదులుగా నగదు, ఇతర కానుకలు ఇచ్చి వరుడి కుటుంబం వారిని సరిపెట్టుకోమంటున్నారు. ఇంకొందరు పసిడికి సరిపడా రేటు ఉండే భూములను వరుడి కుటుంబానికి ఇస్తున్నారు. భారత్‌లో పసిడి ధర తులానికి రూ.89,790 వరకు ఉంది.

ఆభరణాలు చేయించుకుంటే ఆ ధర, తరుగు, ట్యాక్స్ వంటివి అన్ని కలిపి లక్ష రూపాయలకుపైగా ఖర్చు అవుతోంది. కరోనాకి ముందు పరిస్థితి వేరేగా ఉండేది. 2019లో తులం పసిడి ధర సుమారు రూ.35,000గా ఉండేది. కరోనా తర్వాత బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయని వ్యాపారులు అంటున్నారు.

దీంతో పెళ్లిళ్ల సమయంలో సామాన్యులు పసిడి కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. పసిడి దుకాణాల్లో వ్యాపారాలు బాగా పడిపోయాయి. అప్పట్లో 2-3 తులాలు కొనుగోలు చేసేవారు ఇప్పుడు 4 గ్రాములలోపే కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు. అక్షయ తృతీయలో మాత్రమే తమకు కాస్త గిరాకీ ఉంటుందని, ఇతర సమయాల్లో షాప్‌కు వచ్చేవారే కరవయ్యారని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి అన్నారు.

పసిడి రేట్లు అధికం అవుతుండడంతో అమ్మకాలు సగానికి సగం పడిపోయినట్లు మరో వ్యాపారి తెలిపారు. ఒకప్పుడు పుస్తె కోసం 10 తులాల బంగారాన్ని చాలా మంది కొనేవారని, ఇప్పుడు దానికి కూడా 5 తులాలే వాడుతున్నారని చెప్పారు.