Syria Crisis: సిరియాకు వెళ్లొద్దు.. అక్కడున్న భారతీయులు వెంటనే వచ్చేయండి.. అర్థరాత్రి కీలక ప్రకటన

భారతీయ పౌరులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సిరియాకు వెళ్లొద్దని, సిరియాలో ఉన్నవారు వెంటనే ఆ దేశాన్ని వీడాలంటూ ..

Syria Crisis

Syria: దశాబ్దం పాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లి గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో తిరుగుబాటు దారులు మళ్లీ రెచ్చిపోతున్నారు. బషర్ అల్ -అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాలను వెనక్కినెడుతూ ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తున్నారు. ఇప్పటికే అనేక కీలక పట్టణాలను వారు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. సిరియా రాజధాని డమాస్కస్ నగరాన్ని కూడా ఆక్రమించేందుకు తిరుబాటుదారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అదేజరిగితే సిరియా పూర్తిగా రెబల్స్ చేతిలోకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో సిరియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఎటునుంచి ప్రమాదం పొంచివస్తుందోనని అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ అర్ధరాత్రి వేళ కీలక ప్రకటన జారీ చేసింది.

Also Read: Joe Biden: జో బైడెన్ మరో సంచలన నిర్ణయం.. వారికి కూడా క్షమాభిక్ష?

భారతీయ పౌరులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సిరియాకు వెళ్లొద్దని, సిరియాలో ఉన్నవారు వెంటనే ఆ దేశాన్ని వీడాలంటూ శుక్రవారం అర్ధరాత్రి తరువాత భారత విదేశాంగశాఖ అడ్వైజరీ జారీ చేసింది. సిరియాలో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని, అత్యవసర పరిస్థితుల్లో డమాస్కస్ లోని ఇండియన్ ఎంబసీతో టచ్ లో ఉండాలని సూచించింది.

Also Read: Florida: ప్లోరిడా న్యాయస్థానం సంచలన తీర్పు.. పార్కులో మరణించిన వ్యక్తి కుటుంబానికి వేలకోట్ల పరిహారం

డమాస్కస్ లోని ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్+963993385973 ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యవసరం అయితే, వెంటనే ఈ నెంబర్ ద్వారా ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని, అలా వీలుకాకుంటే.. hoc.damascus@mea.gov.in ను సంప్రదించాలని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. సిరియాలో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారతీయ పౌరులకు ఆయన సూచించారు.