Florida: ప్లోరిడా న్యాయస్థానం సంచలన తీర్పు.. పార్కులో మరణించిన వ్యక్తి కుటుంబానికి వేలకోట్ల పరిహారం
అమెరికాలోని ప్లోరిడా న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. పార్కులో ప్రమాదవశాత్తూ మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.2,624 కోట్ల పరిహారం ఇవ్వాలని ..

Tyre Sampson
Florida: అమెరికాలోని ప్లోరిడా న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. పార్కులో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.2,624 కోట్ల పరిహారం ఇవ్వాలని ఫ్రీపాల్ టవర్ తయారీదారులు, నిర్వాహక సిబ్బందికి ఆదేశించింది. కార్పోరేషన్లు భద్రత విషయంలో జవాబుదారీతనం తీసుకురావాలనే ఈ తీర్పునిస్తున్నట్లు జూరీ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 2022 మార్చి 14వ తేదీన ఓర్లాండ్ లోని ఐకాన్ పార్కుకు తన ఫుట్ బాల్ టీమ్ తో కలిసి టైర్ సాంప్సన్ అనే 14ఏళ్ల యువకుడు వెళ్లాడు. సాంప్సన్ పార్కులోని ఫ్రీ పాల్ టవర్ ఎక్కాడు. అయితే, ఒక రైడ్ లో 129 కిలో గ్రాముల బరువు మాత్రమే టవర్ మోయగలదు. సాంప్సన్ బరువు 173 కిలో గ్రాములు. అయినా నిర్వాహకులు బాలుడ్ని రైడ్ కు అనుమతించారు. రైడ్ సమయంలో సాంప్సన్ సీటు బెల్టు ఊడిపోవడంతో అతడు 70 అడుగుల దూరంలో ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి
అయితే, మృతుడి తల్లిదండ్రులు నెకియా డాడ్, యార్నెల్ సాంప్సన్ లు గత సంవత్సరం క్రితం కోర్టును ఆశ్రయించారు. ఆపరేటర్ చేసిన తప్పు కారణంగానే తన కుమారుడు ఫ్రీపాల్ రైడ్ లో జారి కింద పడ్డాడని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, గురువారం న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును వెల్లడించింది. ఆస్ట్రియన్ తయారీదారుకు చెందిన ఫన్‌టైమ్, పార్కు నిర్వాహకులు మృతిడి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి 115 మిలియన్ డాలర్లు చొప్పున మొత్తం 310 మిలియన్ డాలర్లు (రూ.2,624 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది.
మృతుడి కుటుంబం తరపు న్యాయవాదులు బైన్ క్రంప్, నటాలీ జాక్సన్ మాట్లాడుతూ.. టైర్ మరణం ఫ్రీపాల్ నిర్వాహకుల తీవ్రనిర్లక్ష్యం వల్లనే జరిగిందని, లాభాలు పొందే విషయంలోచూపే శ్రద్దను భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంలో వారు చూపలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో న్యాయస్థానం పార్కు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలాఉంటే.. 2022లో ఈ ఘటన తరువాత ఫ్రీపాల్ రైడ్ ను మూసివేయాలని స్థానిక ప్రభుత్వం ఆదేశించింది. ఆ తరువాత దానిని మళ్లీ తెరవలేదు.