Myanmar Earthquake : మియన్మార్ లో భూకంపం బీభత్సం.. ప్రార్థనలు చేస్తూ 700 మందికి పైగా ముస్లింలు మృతి..!

మియన్మార్ లో భూకంపం ధాటికి 1700 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.

Myanmar Earthquake : మియన్మార్ లో సంభవించిన భూకంపం బీభత్సం సృష్టించింది. 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీగా ప్రాణ, ఆస్తి నష్టం మిగిల్చింది. మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో భూకంపం రావడంతో 700 మందికిపైగా ముస్లింలు చనిపోయారని ముస్లిం మత పెద్దలు తెలిపారు.

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మసీదుల్లో ప్రార్థనలు చేస్తుండగా.. భూకంపం వచ్చిందని, ఆ సమయంలో భవనాలు కూలిపోయాయని, ఈ ఘటనలో 700 మందికి పైగా చనిపోయారని ముస్లిం మత పెద్దలు వెల్లడించారు. స్ప్రింగ్ రెవల్యూషన్ మియన్మార్ ముస్లిం నెట్ వర్క్ ప్రతినిధి ఈ విషయాన్ని తెలిపారు.

Also Read : బావిలో 17 కిలోల బంగారం..! కర్నాటక దావణగెరెలో గోల్డ్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..

భూకంపం తీవ్రతకు సుమారు 70 వరకు మసీదులు దెబ్బతిన్నాయన్నారు. పలు మసీదులు నేలమట్టం అయ్యాయని తెలిపారు. ఆ సమయంలో ప్రార్థనలు చేస్తున్న వారంతా శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు విడిచారని వెల్లడించారు. మండలే సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. మియన్మార్ లో రెండో పెద్ద సిటీ మండలే. మియన్మార్ లో భూకంపం ధాటికి 1700 మంది చనిపోయారని అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే, మసీదుల్లో ప్రార్థనలు చేస్తూ చనిపోయిన వారి సంఖ్యను అందులో చేర్చారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.