Karnataka Gold Recovery : బావిలో 17 కిలోల బంగారం..! కర్నాటక దావణగెరెలో గోల్డ్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు బావిలో నుంచి 17 కిలోల బంగారు ఆభరణాలు ఉన్న పెట్టెను చాక్యచక్యంగా బయటకు తీశారు.

Karnataka Gold Recovery : కర్నాటక రాష్ట్రంలో 2024లో ఎస్బీఐ బ్యాంకులో జరిగిన భారీ గోల్డ్ చోరీ కేసును దావణగెరె పోలీసులు చాక్యచక్యంగా చేధించారు. 13 కోట్ల విలువైన 17 కిలోల 700 గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు దావణగెరె ఎస్పీ తెలిపారు.
2024 నవంబర్ 28న దావణగెరెలోని ఎస్బీఐ బ్యాంకులో చోరీ కేసుని చేధించేందుకు పోలీసులు గత 6 నెలలుగా విస్తృతంగా దర్యాఫ్తు చేసి చివరికి సాంకేతిక పరిజ్ఞానంతో దొంగల ముఠాను పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో ఎస్బీఐ బ్యాంకులో చోరీ చేసిన బంగారు నగలను ఓ బాక్స్ లో పెట్టి దాన్ని దొంగల ముఠా మధురై జిల్లాలోని ఉస్మాన్ పట్టి గ్రామ శివారులో ఉన్న ఓ బావిలో దాచారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు బావిలో నుంచి 17 కిలోల బంగారు ఆభరణాలు ఉన్న పెట్టెను చాక్యచక్యంగా బయటకు తీశారు. పెట్టెను తెరిచి చూడగా అందులో చోరీకి గురైన బంగారు ఆభరణాలన్నీ బయటపడ్డాయి.
దావణగెరెలోని న్యామతి SBI బ్యాంక్ లో భారీ చోరీ సంచలనం రేపింది. దాదాపు రూ.13 కోట్ల విలువైన బంగారం దొంగిలించబడింది. 2024 అక్టోబర్‌లో జరిగిన ఈ దోపిడీలో 17.7 కిలోల బరువున్న తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు దొంగిలించబడ్డాయి. దావణగెరె జిల్లా పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. దాదాపు 5 నెలల పాటు తీవ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత, గోల్డ్ చోరీ కేసును చేధించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి దొంగిలించబడిన బంగారు నగలను రికవరీ చేశారు.
Also Read : మలుపులు తిరుగుతున్న పాస్టర్ ప్రవీణ్ కేసు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్ వీడియో
2024 అక్టోబర్ 28న న్యామతి SBI బ్యాంక్ బ్రాంచ్ అధికారులు.. తమ స్ట్రాంగ్ రూమ్ లాకర్లలో ఒకదాన్ని గ్యాస్ కట్టర్ ఉపయోగించి పగలగొట్టి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. కిటికీ ఇనుప గ్రిల్‌ను తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు లాకర్‌ను కట్ చేసి అందులో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా దొంగలు తెలివిగా వ్యవహరించారు. బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ కలిగున్న డీవీఎర్ ను ఎత్తుకెళ్లిపోయారు. ఘటన స్థలంలో కారం పొడి చల్లారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. దొంగతనం జరిగిన చోటు నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ఆధారాల కోసం గాలించారు. 50 కిలోమీటర్ల రేంజ్ వరకు సీసీటీవీ ఫుటేజ్ ని జల్లెడ పట్టారు. మొబైల్ టవర్స్ సిగ్నల్స్, ఇంటర్ స్టేట్ టోల్ డేటాను విశ్లేషించారు. చివరికి దొంగలను పట్టుకున్నారు.
వారిని విచారించగా.. బంగారాన్ని బాక్స్ లో పెట్టి 30 అడుగుల లోతున్న వ్యవసాయ బావిలో దాచినట్లు చెప్పారు. గజ ఈతగాళ్లను రప్పించిన పోలీసులు బావిలో గాలించారు. ఈ క్రమంలో వారికి పెద్ద బాక్స్ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో చోరీకి గురైన బంగారు నగలు కనిపించాయి. అలా దొంగలు ఎత్తుకెళ్లిన బంగారాన్ని పోలీసులు రికవరీ చేయగలిగారు.