Twitter Blue Tick: అమెరికాలోని చాలా నకిలీ ట్విటర్ ఖాతాలు ఎనిమిది డాలర్లు చెల్లించి బ్లూ టిక్‌ను పొందాయి. దీంతో ఇబ్బంది పడిన ట్విటర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను బ్యాన్ చేసింది. అయితే బ్లూటిక్ పున: ప్రారంభం ఎప్పుడంటూ ట్విటర్‌లో ఇటీవల మస్క్‌ను పలువురు ప్రశ్నించారు. వచ్చేవారం చివరిలో అంటూ మస్క్ సమాధానం ఇచ్చాడు. ఇవాళ మస్క్ బ్లూటిక్ పున:ప్రారంభంపై స్పష్టమైన తేదీని వెల్లడించారు.
ట్విటర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 29 నుంచి పునఃప్రారంభించబడుతుందని మస్క్ తెలిపారు. ఇది రాక్ సాలిడ్ అని నిర్ధారించుకోవడానికి లాంచ్‌ను వాయిదా వేస్తున్నట్లు మస్క్ చెప్పారు. అయితే ఈసారి మాత్రం బ్లూటిక్ ఇవ్వడంపై చాలా జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు.
Punting relaunch of Blue Verified to November 29th to make sure that it is rock solid
— Elon Musk (@elonmusk) November 15, 2022
ఎలోన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న నాటినుండి అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఖర్చులను తగ్గించుకొనేందుకు ఉద్యోగులపై వేటు వేశారు. తొలుత సంస్థలో పనిచేస్తున్న సగం మంది ఉద్యోగులను తొలగించిన మస్క్.. తాజాగా సుమారు 4వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. ట్విటర్ సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా బ్లూటిక్ ను అందుబాటులోకి తెచ్చారు. బ్లూటిక్ ను పొందిన ఖాతాల్లో అధికంగా నకిలీ ట్విటర్ ఖాతాలు ఉండటంతో తాత్కాలికంగా బ్లూటిక్ సేవలను మస్క్ నిలిపివేశారు. ట్విటర్ యాజమాన్య హక్కులు పొందిన నాటినుంచి మస్క్ సంచలన నిర్ణయాలకు కేంద్ర బింధువుగా మారాడు.