Elon Musk
Elon Musk: ట్విటర్ కొనుగోలు తరువాత ప్రపంచ వ్యాప్తంగా టెస్లా అధిపతి, బిలియనీర్ ఎలాన్ మస్క్ పేరు మారుమోగిపోతున్నప్పటికీ.. తన ఆస్తుల విలువ క్రమంగా తగ్గిపోతుందన్న వాదన వినిపిస్తోంది. కొంతకాలంగా ప్రపంచ ధనవంతుల్లో మొదటి స్థానంలో కొనసాగుతూ వచ్చిన మస్క్.. ఈ వారంలో రెండవ స్థానానికి పడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్ మరోసారి టెస్లా షేర్లను విక్రయించారు. 3.58 బిలియన్ డాలర్ల విలువైన 22 మిలియన్ల టెస్లా షేర్లను మస్క్ విక్రయించారు. ట్విటర్ కొనుగోలు చేస్తానని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన మస్క్.. ఆ తరువాత కాలంలో 19 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను పలు దఫాలుగా విక్రయించాడు. తాజాగా మరో 3.58 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాడు. దీంతో ఇప్పటి వరకు మస్క్ విక్రయించిన టెస్లా షేర్లు విలువ మొత్తం 23 బిలియన్ డార్లకు చేరింది.
ట్విటర్ కొనుగోలు నిర్ణయం తరువాత పలు దఫాలుగా 19 బిలియన్ డాలర్ల టెస్లా షేర్లను విక్రయించిన సమయంలో ట్విటర్ నిధుల కోసమని మస్క్ ప్రకటించారు. ప్రస్తుతం 3.56 బిలియన్ డాలర్ల విలువైన సంస్థ షేర్లను విక్రయించినప్పటికీ అందుకు గల కారణాలను మస్క్ వెల్లడించలేదు. అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛైంజ్ కమిషన్ (సెక్) వివరాల ప్రకారం.. ఇప్పటికీ టెస్లాలో 13.4శాతం వాటాతో మస్కే అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. అయితే.. 400 డాలర్ల గరిష్ఠ ధర నుంచి షేరు తగ్గుతూ వచ్చి ప్రస్తుతం 158 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Elon Musk: మరో కీలక నిర్ణయం తీసుకున్న మస్క్.. ట్రస్ట్ అండ్ సేప్టీ కౌన్సిల్ రద్దు ..
టెస్లా, స్పేస్‌ఎక్స్‌లోని తన బృందాలు చాలా బాగున్నాయని, వారికి నిజంగా నా అవసరం లేదని షేర్ల విక్రయానికి ముందు డిసెంబర్ 14న మస్క్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. టెస్లా నుంచి మీ దృష్టి మరల్చకండి అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. టెస్లా దీర్ఘకాలంగా గొప్పగా ఉంటుందని మస్క్ అన్నాడు. అంతేకాదు.. టెస్లా షేర్ హోల్డర్లు ట్విటర్ నుండి దీర్ఘకాలికంగా ప్రయోజనాలను పొందేలా చూస్తాను అంటూ బదులివ్వడం గమనార్హం.