Nairobi black market baby business : కెన్యాలోని నైరోబిలో పసిబిడ్డల్ని వీధిలో కూరగాయాలు అమ్మినట్లుగా అమ్మేస్తున్నారు. యదేచ్ఛగా జరిగిపోతున్న పసిబిడ్డల అమ్మకాలు వారి తల్లులకు కడుపు శోకాన్ని రగిలిస్తున్నాయి. తల్లుల నుంచి బిడ్డలను ఎత్తుకుపోయి అమ్మేస్తుంటారు. అలా మాయం అయిన పిల్లలు బతికున్నారో లేదో కూడా తెలియని తల్లులు జీవితాంతం వారి కోసం ఏడుస్తూనే ఉంటారు. పొత్తిళ్లలో ఉండే పసిపిల్లల్ని కూడా ఎత్తుకుపోయి ఏదో మొక్కజొన్న కండెల్ని అమ్మినట్లుగా అమ్మేస్తుంటారు. అలా రెబెక్కా అనే ఓ అభాగ్యురాలి బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారు. ఆ బిడ్డ బతికున్నాడో లేదో కూడా ఆమెకు తెలీదు. బిడ్డ కోసం ఆమె తిరగని ప్రాంతమంటూ లేదు. కానీ ఫలితం లేదు. బిడ్డను తలచుకుని విలపిస్తూనే జీవితాన్ని నెట్టుకొస్తోంది రెబెక్కా.
దగాపడ్డ రెబెక్కా దీన గాథ..
రెబెక్కాకు ఊహకూడా తెలియని వయస్సులో ఆమె తల్లి వదిలేసింది. దిక్కులేని రెబాక్కాను ఓ వృద్ధుడు పరిచయమయ్యాడు. ఆశ్రయం దొరికింది కదాని సంతోషపడింది. అలా ఆమెకు 14 ఏళ్లు వచ్చేసరికి ఆశ్రయం ఇచ్చినవాడికి కామం కమ్మింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గర్భం చేసి వదిలేశాడు. వీధిలోకి నెట్టేశాడు. అలా వీధినపడ్డ రెబెక్కాకు ఓ పిల్లాడు పుట్టాడు. అప్పటికి రెబెక్కా వయస్సు 15 ఏళ్లు మాత్రమే.
ఆబాబుకు లారెన్స్ అని పేరు పెట్టుకుంది. భిక్షమెత్తుకుంటూ పిల్లాడిని పెంచుకునేది. అలా రెబెక్కా మత్తుకు బానిసైంది. పిల్లాడికి సంవత్సరం వయస్సు వచ్చింది. ఓ రోజు మత్తులో పడి ఉన్న ఆమె పక్కన నిద్రపోతున్న పిల్లాడిని ఎవరో ఎత్తుకుపోయారు. మత్తు వదిలాక చూసుకుంటే కొడుకు కనిపించలేదు.చాలా చోట్ల వెదికింది. కానీ దొరకలా..అలా తొమ్మిదేళ్లు గడిచాయి. ఆ పిల్లాడు బతికి ఉన్నాడో లేదో తెలీదు. బతికి ఉంటే ఆ పిల్లాడికి 10 ఏళ్లు వచ్చి ఉంటాయి. అప్పటి నుంచి తన బిడ్డను ఆమె మళ్లీ చూడలేదు.
రెబెక్కాకు తరువాత మరో ముగ్గురు పిల్లలు పుట్టారు. దీనిపై రెబెక్కా మాట్లాడుతూ..నాకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు పుట్టారు. కానీ లారెన్స్ నా మొదటి బిడ్డ..నా పిల్లాడి కోసం పిల్లల కేంద్రాలున్న ప్రతి చోటా వెతికాను. కానీ, వాడు దొరకలేదు అని ఉబికి వస్తున్న కన్నీళ్లతో చెబుతుందామె. రెబెక్కాలాంటి ఎంతోమంది మహిళలవి ఇటువంటి దీనగాథలే.
2018 ఆగస్టులో ఏస్థర్ ఓ తల్లి రెండేళ్ల కొడుకు కారోల్ ని ఎవరో ఎత్తుకుని పోయారు. తన కొడుకును తనకు వెనక్కి ఇస్తే..వారిని తాను క్షమిస్తానని నా బిడ్డను గుండెల్లో పెట్టుకుని పెంచుకంటానని అంటోందామె. ఇటువంటి నిస్సహాయ మహిళలను టార్గెట్ గా చేసుకుని నైరోబీలో పిల్లల అక్రమ రవాణా వ్యాపారాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎటువంటి అండా లేని తల్లుల నుంచి పిల్లలను ఎత్తుకుపోయి..భారీ లాభాలకు అమ్ముకుంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏమీ పట్టించుకోదా అంటే..ప్రభుత్వంలో ఉండే కొంతమంది అధికారులు ఈ పిల్లల అక్రమ రవాణాలను..పిల్లల విక్రయాలకు సహకరిస్తున్నారు.
ఇటువంటి వారిలో మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన అనిటా అనే మహిళ ఉంది. ఆమె వీధుల్లో తిరుగుతూ రెబెక్కా లాంటి మహిళల దగ్గర నుంచి డబ్బులు దొంగలిస్తూ బతుకు వెళ్లదీస్తూంటుంది. అనికా మూడేళ్ళ లోపు పిల్లలున్న తల్లులను లక్ష్యంగా చేసుకుని అదను చూసి తన పని చక్కబెట్టేసుకుంటుంది. వీధుల్లో పిల్లలను దొంగిలించడానికి అనిటా ట్రిక్కులు ఉపయోగిస్తుంది. ఏ పిల్లనైతే దొంగిలించాలనుకుంటుందో ముందుగా వీధిన పడ్డ తల్లులతో పరిచయం పెంచుకుంటుంది. సహాయం చేస్తానని నమ్మిస్తుంది. అలా అదను చూసి వారి బిడ్డల్ని ఎత్తుకుపోతుంది. కొన్నిసార్లు ఆ తల్లులకు మత్తు ఇచ్చి, పిల్లలను ఎత్తుకెళ్లిపోయి అమ్మేసుకుంటుంది.
కాగా అనిటా లాంటి పిల్లల దొంగలకు పైన ఓ యజమాని ఉంటాడు. వాడు అనుకున్న సమయానికి పిల్లల్ని అందించకపోతే ఊరుకోడు. బెదిరిస్తాడు. చంపేస్తానంటాడు. దీంతో వీలైనంత వరకూ దగాపడి వీధినపడ్డ తల్లుల్ని ఎంచుకుంటుంది. ఎందుకంటే వారికిసహాయంగా ఎవ్వరూ ఉండరు. దీంతో ఆమె పని ఈజీ అయిపోతుంది. తన యజమాని చిన్న చిన్న నేరస్థుల నుంచి దొంగలించిన పిల్లలను కొనుక్కుని వారిని భారీ లాభాలకు అమ్ముతుంటాడు.
కొంత మంది పిల్లలు లేని తల్లులు పిల్లల్ని పెంచుకునేందుకు ఎత్తుకొచ్చిన పిల్లల్ని కొనుక్కుంటారు. ఇంకొందరు క్షుద్ర పూజలు చేసి వారిని బలి ఇవ్వడానికి కొనుక్కుంటారని అనిటా ఓ రహస్య సర్వే టీమ్ కు తెలిపింది. ఒక సారి అమ్మేశాక ఆ పిల్లలు ఏమవుతారో అనిటాకు కూడా తెలియదు. పట్టించుకోదుకూడా. ఆడపిల్ల అయితే 34,391 రూపాయలు మగపిల్లాడైతే 53,990 రూపాయలు కొంటారని అనిటా తెలిపింది. అలా పిల్లల్ని దొంగిలించటంలోను పోలీసులకు దొరక్కుండా పారిపోవటంలోను అనిటా బాగా ఆరితేరిపోయింది. ఒకవేళ దొరికినా ఎవరోకరు పిల్లల వ్యాపారం చేసేవారు ఆమెను విడిపించేస్తారు. అంత దుర్మార్గం పనిచేసినా ఆమె పిల్లల్ని అమ్మగా వచ్చిన డబ్బుతో రేకుల ఇల్లు కట్టుకుంది.
కెన్యాలో పిల్లల అక్రమ రవాణా గురించి గణాంకాలు కానీ, ప్రభుత్వ నివేదికలు కానీ, జాతీయ సర్వేలు కానీ సరిగ్గా ఉండవు.ఎందుకంటే చాలా వరకూ ప్రభుత్వ లెక్కల్లోకి రావు. ఎందుకంటే కేసులు నమోదు కావు కాబట్టి.ఇలా తప్పిపోయిన పిల్లలను ఆదుకునేందుకు మర్యాన మున్యేన్దో అనే ఓ మహిళ గత నాలుగేళ్ల నుంచి ‘మిస్సింగ్ చైల్డ్ కెన్యా ‘అనే స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు. అలా ఆ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 600 మిస్సింగ్ చిల్డ్రన్స్ కేసులను పరిష్కరించారామె.
బాధితులు ఎక్కువగా నిస్సహాయ వర్గాలకు చెందినవారే కావడం వల్ల సాంఘిక సంక్షేమ ప్రణాళికల్లో దీనికి పెద్దగా ప్రాధాన్యత ఉండదని ఆమె తెలిపారు. పిల్లల అక్రమ రవాణా..అమ్మకాలకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకునే శక్తి కూడా బాధిత నిస్సహాయ తల్లులకు ఉండదని ఆమె అన్నారు.ఆఫ్రికాలో పిల్లలు పుట్టని మహిళలను అరిష్టంగా చూస్తారు. వారి పాపులని అందుకే వారికి పిల్లలు పుట్టలేదనీ..వారిని చూస్తే పాపం చుట్టుకుంటుందనే నమ్మకాలు బాగా పాతుకుపోయాయి. ఆడజన్మ ఎత్తిన ప్రతీ మహిళల పిల్లలను కనాలని.. అందులోనూ మగపిల్లలనే కనాలని ఒత్తిడి కుటుంబాల్లో ఉంటుంది.
పిల్లలు పుట్టిన మహిళల్ని ఇంటి నుంచి బయటకు తరిమేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మహిళలు పిల్లల అక్రమ వ్యాపారం చేసేవారిని సంప్రదిస్తారు. కాపురాలు నిలబెట్టుకునేందుకు పిల్లల్ని కొనుక్కుంటారు. ఆ వ్యాపారులు అనిటా లాంటి వారిని వాడుకుని పిల్లలు లేని వారికి పిల్లల్ని అమ్ముతారు. లేదా కొంతమంది క్షుద్రపూజలు చేసేవారు అధిక ధర ఇస్తానంటే వారికి అమ్మేస్తారు.
నైరోబి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పిల్లల అక్రమ రవాణా ముఠాలు ఉన్నాయి. హాస్పిటల్ పుట్టిన చాలామంది పిల్లల్ని సిబ్బంది అమ్మేసుకుంటారని పలు సర్వేల్లో తేలింది.
దీని గురించి ఓ పిల్లలు లేని మహిళ మాట్లాడుతూ..‘‘నాకు పెళ్లైంది. పిల్లలు పుట్టలేదు.నా భర్త నుంచి అత్తవారి కుటుంబం నుంచి పిల్లల్ని కనాలని ఒత్తిడి వస్తోంది..దీంతో ఓ పిల్లాడిని కొనుక్కోవాల్సి వచ్చిందని తెలిపింది.
ఆఫ్రికా వీధుల్లో అనధికారికంగా నడిచే క్లినిక్‌ల్లో ప్రసూతి గదులు ఉంటాయి. పిల్లల అక్రమ రవాణాకు ఇవి ప్రముఖమైన కేంద్రాలుగా ఉంటాయి. నైరోబిలో కొన్ని పెద్ద హాస్పిటళ్లలో మేరీ అనే మహిళ నర్స్‌గా పని చేసింది. ఆమె దగ్గరకు ఒకామె బిడ్డను కొనుక్కోవడానికి వచ్చినట్లుగా వచ్చింది. అప్పటికే క్లినిక్‌లో ఇద్దరు మహిళలు ప్రసవించటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లలో ఒకరికి పుట్టబోయే బిడ్డను 30,922 రూపాయలకు అమ్ముతానని మేరీ బేరం కుదుర్చుకుంది.
గర్భంతో ఉన్న ఆవిడ ఆరోగ్యం గురించి నర్స్ మేరీకి అవసరం లేదు. బిడ్డను ప్రసవించాక ఆమె చచ్చిపోయినఫరవాలేదు. బిడ్డ పుడితే చాలు అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఆ బిడ్డను తనకు ఇచ్చేస్తే నీకు 6,871 రూపాయలు ఇస్తానని ముందే ప్రసవించే ఆమె వద్ద మేరీ బేరమాడుకుంది. మరోపక్క తాను అదే బిడ్డను 30,922 రూపాయలకు అమ్మేందుకు బేరం కుదుర్చేసుకుంది. బిడ్డ పుట్టిన వెంటనే ఆ శిశువుని అమ్మేసి తనకు రావాల్సిన డబ్బులు తీసుకుని..వెళ్లిపోతుందంతే.
ఒకవేళ బిడ్డను ఇలా నిస్సహాయంగా ఉండే తమ పిల్లలను కోల్పోయిన తల్లులకు ఎప్పటికీ ఓ పరిష్కారం దొరకదు. వారి పిల్లలు దొరకరు. తిరిగి తమ పిల్లలను కలిసే అవకాశం లక్షలో ఒక్కరికి కూడా దక్కదు. ఈ వీధుల్లో జీవితాలు వెళ్లబుచ్చే తల్లులు ఒకప్పుడు దిక్కులేని పిల్లలే. వారి నిస్సహాయతను అవకాశవాదులు ఉపయోగించుకున్నారు. శారీరకంగా వాడుకుంటారు. వాళ్లు బిడ్డల్ని కంటారు. వారి బిడ్డల్ని ఇలా పిల్లల్ని దొంగిలించేవారు ఎత్తుకుపోతారు. ఇలా వారి జీవితాలు వెళ్లదీస్తున్నారు. అత్యంత ఘోరంగా..భారంగా..దీనాతి దీనంగా…
అటువంటినిస్సహాయులు తమకు న్యాయం కావాలని పోరాడే శక్తికూడా వారికి ఉండదు. ఆ బలహీనతే పిల్లల అక్రమ వ్యాపారులకు వరంగా మారింది. కానీ, ఓ తల్లికి బిడ్డను కోల్పోతే ఎంత బాధ ఉంటుందో..ఎంత వేదన భరిస్తుందో..జీవితాంతం ఎంతగా కుమిలిపోతుందో వారికి అవసరం లేదు. వారికి కావాల్సిందల్లా చేతిలో కాసులు రాలటం మాత్రమే…!