Discord App: నేపాల్ చరిత్రను మలుపుతిప్పిన యాప్.. జెన్ జీ నిర్ణయాలన్నీ ఇందులోనే.. ఏంటీ యాప్.. అందులో ఏముంది?

నేపాల్‌లోని యువత డిస్కార్డ్ యాప్‌ను వినియోగించుకొని ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కీని ఎన్నుకున్నారు.

Discord App

Discord App: నేపాల్‌లో జెన్-జడ్ యువత నిరసనల కారణంగా ఆ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. పెద్దెత్తున నిరసనలు, దాడులు చోటు చేసుకోవటంతో దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. దీంతో ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే, ఆ దేశంలో తాత్కాలిక ప్రధాని ఎంపిక చకచకా జరిగిపోయింది. సోషల్ మీడియా బ్యాన్ నేపథ్యంలో నిరసనకారులు డిస్కార్డ్ అనే చాట్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల్‌ కార్కీకేను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో డిస్కార్డ్ యాప్ అంటే ఏమిటి..? దాన్ని అక్కడి యువత ఎలా ఉపయోగించారు.. ఏ విధంగా తాత్కాలిక ప్రధానిని ఎంపిక చేశారనే విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.

Also Read: Sushila Karki: నేపాల్‌కు కొత్త లీడర్.. తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి.. ఎవరీ సుశీల.. భారత్‌తో ఉన్న అనుబంధం ఏంటి..

డిస్కార్డ్ యాప్ అంటే ఏమిటి?

♦ 2015 సంవత్సరంలో జాసన్ సిట్రాన్, స్టానిస్లావ్ విష్నేవ్‌స్కీ‌లు ఈ డిస్కార్డ్ యాప్‌ను ఆవిష్కరించారు.
♦ తొలుత ఇది డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ ఫారమ్. దీనిని గేమర్స్ కోసం రూపొందించారు. కానీ, కొంతకాలంకు ఈ యాప్‌లో మార్పులు చేశారు.
♦ గేమ్ ఆడుతున్న సమయంలో వారి స్నేహితులతో కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇబ్బంది కలగకుండా చాటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
♦ 2016 చివరి నాటికి డిస్కార్డ్ యాప్ 25 మిలియన్లకుపైగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది.
♦ కరోనా సమయంలో (2020లో) డిస్కార్డ్ యాప్ విపరీతమైన ఆదరణ పొందింది. ముఖ్యంగా జెన్-జడ్ యూజర్లను ఇది ఆకట్టుకుంది.
♦ తరువాత కాలంలో గేమింగ్ సమయంలో యాప్‌ను ఉపయోగించడం మాత్రమేకాక.. జెన్-జడ్ యూజర్లకు ఆసక్తి ఉన్న వివిధ అంశాలకు అనుగుణంగా డిస్కార్డ్ సర్వర్లు ఏర్పాటయ్యాయి.
♦ డిస్కార్డ్ ద్వారా వినియోగదారులు సర్వర్లు అనే కమ్యూనిటీలు ఏర్పాటు చేసి టెక్ట్స్, ఆడియో, వీడియో చానెల్స్ ద్వారా చర్చలు జరపడం ప్రారంభించారు.
♦ స్క్రీన్ షేరింగ్, స్ట్రీమింగ్, మోడరేషన్ టూల్స్ వంటి పీచర్లు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి.
♦ ఒక్కో సర్వర్‌లో గరిష్ఠంగా ఐదు లక్షల మంది చేరొచ్చు. కానీ, ఒకేసారి 2.5లక్షల మంది మాత్రమే యాక్టివ్‌గా ఉండగలరు.
♦ డిస్కార్డ్ సర్వర్ అనేది ఒక పెద్ద కమ్యూనిటీ స్థలంగా మారింది. అందుకే నేపాల్ యువత ఉద్యమానికి దీనిని ఒక వేదికగా మల్చుకుంది.

డిస్కార్డ్‌ను జెన్‌-జడ్ నిరసనకారులు ఎలా ఉపయోగించారు?

♦ జెన్-జడ్ యువత తమ నిరసనలకోసం ప్రధాన ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడుకున్నారు.
♦ సర్వర్లు, ఛానళ్ల ద్వారా వినియోగదారులు చర్చల్లో పాల్గొంటున్నారు.
♦ ఓలీ రాజీనామా తరువాత తదుపరి నాయకుడిని ఎంచుకోవడానికి యూత్ అగైనెస్ట్ కరప్షన్ (Youth Against Corruption) డిస్కార్డ్ సర్వర్‌ను ఉపయోగించారు.
♦ ఈ సర్వర్‌లో 1.45లక్షల కంటే ఎక్కువ మంది సభ్యులు చేరారు. ఈ సర్వర్‌లో చర్చలు, అనౌన్స్‌మెంట్, ఫ్యాక్ట్‌చెక్, హెల్ప్‌లైన్లు వంటివి కొనసాగించింది. వారు ఏర్పాటు చేసిన డిస్కార్డ్ సర్వర్లలో సమాచారం సులభంగా చేరింది. పెద్ద సంఖ్యలో సభ్యులు చర్చలు జరిపేందుకు ఇదో కీలక వేదికగా నిలిచింది.
♦ నేపాల్ తదుపరి ప్రధానిని నిర్ణయించడానికి సర్వర్ బహుళ పోల్స్ నిర్వహించింది.
♦ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ, నేపాల్ పవర్ హౌజ్ గా పేరున్న కుల్మన్ ఘీసింగ్, రాపర్ బాలేంద్ర షా ఇలా పలువురి పేర్లతో ఓ డైలామా ఏర్పడగా.. డిస్కార్డ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ జరిగింది.
♦ డిస్కార్డ్ లోని సభ్యులు వారి ఎంపిక ప్రకారం ఓటు వేశారు. అయితే, ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నదంతా కేవలం నేపాల్ పౌరులని చెప్పలేం. నేపాల్‌కు చెందిన వారుకూడా అయ్యుండకపోవచ్చునని తెలుస్తోంది.
♦ సెప్టెంబర్ 10న నేపాల్ తదుపరి ప్రధానిగా డిస్కార్డ్ సర్వర్ ద్వారా నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కిని ఎంపిక చేశారు.
♦ సౌత్ చైనా మార్కింగ్ పోస్టు ప్రకారం.. సుశీల్ కార్కీకే 50శాతం ఓట్లు పడ్డాయి. ఆమె మరుసటి రోజు నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పాడెల్, ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌లను కలిశారు.
♦ ఎన్నికలను పర్యవేక్షించగల తాత్కాలిక నాయకుడిని సూచించడానికి మాత్రమే ఓటింగ్ ఉద్దేశించబడిందని ఛానల్ మోడరేటర్ అయిన షాస్వోత్ లామిచానే న్యూయార్క్ టైమ్స్‌తో అన్నారు.