Sushila Karki: నేపాల్‌కు కొత్త లీడర్.. తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి.. ఎవరీ సుశీల.. భారత్‌తో ఉన్న అనుబంధం ఏంటి..
ఎవరీ సుశీల కర్కి? గతంలో ఏం చేశారు? జెన్ Z నిరసనకారులు సుశీలవైపు ఎందుకు మొగ్గుచూపారు?

Sushila Karki: యువత ఆందోళనలతో అట్టుడికిపోయిన నేపాల్ లో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. తాజాగా ఆ దేశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్ నడిపించే లీడర్ ఖరారయ్యారు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమె పేరుని జెన్ జెడ్ ప్రతినిధులు ప్రతిపాదించగా.. అందుకు దేశాధ్యక్షుడు, ఆర్మీ ఓకే చెప్పారు. ఈ మేరకు జెన్ జెడ్ ప్రతినిధులు, అధ్యక్షుడు, ఆర్మీ మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అటు, నేపాల్ పార్లమెంట్ ను అధ్యక్షుడు రద్దు చేశారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా సేవలు..
సుశీల గతంలో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేశారు. సుశీల కర్కి వయసు 73ఏళ్లు. తదుపరి ఎన్నికల వరకు ఆమె దేశాన్ని నడిపిస్తారని సమాచారం. సుశీల కర్కికి భారత్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె భారత్ లో విద్యను అభ్యసించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో మాస్టర్ చేశారు. నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ సుశీల కర్కి. ఇప్పుడు హిమాలయ దేశంలో అత్యున్నత కార్యనిర్వాహక పదవికి ఎంపికైన తొలి మహిళ కూడా ఆమె కానున్నారు.
సోషల్ మీడియాపై బ్యాన్ విధిస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చెలరేగిన ఆందోళనలు.. దేశాన్నే కుదిపేశాయి. యువత నిరసనలతో దేశం అట్టుడికిపోయింది. ఏకంగా ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తాత్కాలిక ప్రధాని ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. తాత్కాలిక ప్రధాని రేసులో పలువురి పేర్లు వినిపించాయి.
దేశానికి ఎవరు నాయకత్వం వహిస్తే బాగుంటుంది అనే అంశంపై జనరేషన్ జెడ్ చర్చలు జరిపింది. ఈ క్రమంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. రాపర్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా (35), విద్యుత్ కోతలను అంతం చేయడంలో ఫేమస్ అయిన నేపాల్ విద్యుత్ అథారిటీ మాజీ అధిపతి కుల్మాన్ ఘిసింగ్ (54) పేర్లు కూడా చర్చకు వచ్చాయి. అయితే, జనరేషన్ జెడ్.. నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేసిన సుశీల వైపు మొగ్గు చూపింది.
నేపాల్ లో అల్లర్లు మొదలైనప్పటి నుంచి జెన్ Z ఆందోళనకారులు తమ ప్రతినిధిగా సుశీలనే ఎన్నుకున్నారు. అవినీతిలో కూరుకుపోయిన కేపీ ఓలీ క్యాబినెట్ ను రోడ్లపై ఉరికించి మరీ కొట్టారు. జెన్ జెడ్ ఆందోళనకారుల ఆగ్రహ జ్వాల తాళలేక నాయకులంతా ప్రాణభయంతో హెలికాప్టర్లలో పారిపోయారు. అసలు ఓలీ ఎక్కడున్నారో ఇప్పటివరకు తెలియలేదు. ఇక ప్రభుత్వ భవనాలను, నేతల ఇళ్లను సైతం ఆందోళనకారులు తగలబెట్టారు.
అందుకే.. సుశీలవైపు జెన్ జెడ్ ప్రతినిధుల మొగ్గు..
కొత్త ప్రధానిగా సుశీల కర్కి పగ్గాలు చేపడతారని ప్రచారం జరిగినా.. ఖాట్మండు మేయర్ బాలేన్ షా పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత సడెన్ గా విద్యుత్ బోర్డు మాజీ ఎండీ కుల్మాన్ ఘిసింగ్ తాత్కాలిక ప్రధాని అయిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ముగ్గురితో పాటు మరికొందరి పేర్లు పరిశీలించారు. ఆందోళనకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరికి సుశీల పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. జెన్ జెడ్ చేసిన ప్రతిపాదనలకు సుశీల ఒప్పుకున్నట్లు, అందుకే ఆమె వైపే వారు మొగ్గుచూపిటట్లు సమాచారం.