Dawood Ibrahim
Dawood Ibrahim:అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ. 25లక్షల నగదు రివార్డును ప్రకటించింది. అతని సహచరులైన ఛోటా షకీల్ పై రూ.20లక్షలు, అనీస్, చిక్నా, మెమన్ ఒక్కొక్కరిపై రూ. 15లక్షల చొప్పున నగదు రివార్డును ప్రకటించినట్లు ఎన్ఐఏ సీనియర్ అధికారులు ఒకరు బుధవారం తెలిపారు. దావూద్, అతని సహచరులు ‘డీ’ కంపెనీ – ఇబ్రహం గ్యాంగ్ భారత్‌దేశంలో స్మగ్లింగ్ చేయడానికి ఒక యూనిట్‌ను స్థాపించారని సంబంధించిన విచారణలో వెల్లడైందని, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్, నకిలీ భారత కరెన్సీ నోట్లు (ఎఫ్ఐసీఎన్) తరలింపుతోపాటు పాకిస్థాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థలతో సన్నిహితంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్నాయని అధికారి తెలిపారు.
పాకిస్థాన్ లోని కరాచీలో ఉండి 1993 ముంబై వరుస పేలుళ్లతో సహా భారత్ లోని అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇబ్రహీం తలపై ఇప్పటికే 2003లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 25 మిలియన్ డాలర్లను ప్రకటించింది. దావూద్ భారతదేశంకు వాంటెడ్ వ్యక్తుల్లో ఒకరు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, హిజ్బుల్ మజాహిదీన్ వ్యవస్థాపకుడు సలావుద్దీన్, అతని సన్నిహితుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్ తో కలిసి ప్రముఖ రాజకీయ నేతలను టార్గెట్ చేసేందుకు ‘డీ’ కంపెనీని ఏర్పాటు చేసినట్లు గతంలో ఏఎన్ఐ గుర్తించిన విషయం విధితమే. ఉగ్రవాద గ్రూపులు, పాక్ గూఢచారి సంస్థ ఐఎన్ఐ సాయంతో భారత్ లో ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు.
దావూద్ కోసం ముంబయి కేంద్రంగా హవాలా వ్యాపారులు పనిచేస్తున్నట్లు ఏఐఏ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముంబయిలోని దావూద్ అనుచరుల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు చేసింది. దావూద్ కు చెందిన డీ- కంపెనీ హవాలా ఆపరేటర్లు, కీలక వ్యక్తులపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఉగ్ర కార్యకలాపాల ద్వారా భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.