H 1b
H-1B Lottery: ఎన్నో ఏళ్లుగా ఉన్న హెచ్-1బీ వర్క్ వీసా లాటరీ వ్యవస్థ స్థానంలో ఇప్పుడు అమెరికా కొత్త విధానాన్ని తీసుకువస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది.
ఇకపై నైపుణ్యాలు అధికంగా ఉండే, అధిక వేతనాలు పొందే విదేశీ ఉద్యోగులకే అమెరికా ప్రాధాన్యం ఇవ్వనుంది. దీంతో ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్స్‌కు వీసాలు పొందడం కష్టతరం కానుంది. భారత్‌కు చెందిన ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్స్ కూడా వీసాలు అంత సులువుగా పొందలేరు.
వీసాల జారీ ప్రక్రియలను మార్చుతూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వరుసగా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వీసా జారీ ప్రక్రియపై ఆ దేశంలోని విశ్లేషకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులు వచ్చి పనిచేసుకునేలా ఉందని, దీంతో అమెరికా పౌరులకు ఉద్యోగాలు దొరకడం కష్టతరమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న వీసా జారీ ప్రక్రియ వల్ల అమెరికాలో ఆవిష్కరణలు రూపొందుతాయని ప్రస్తుత విధాన మద్దతుదారులు చెబుతున్నారు.
Also Read: ఆ 2 పదాలు వాడినందుకే క్షమాపణలు.. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు కాదు.. ఎవరికీ భయపడా: శివాజీ సంచలనం
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త విధానం 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తుంది. ఏడాదికి దాదాపు 85,000 హెచ్ 1బీ వీసాలను కేటాయించనున్నారు. 2027 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది ప్రారంభమవుతుంది. అమెరికాలో ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది.
అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రతినిధి మాథ్యూ ట్రాజెసర్ మాట్లాడుతూ.. “హెచ్ 1బీ రిజిస్ట్రేషన్ల విషయంలో ర్యాండమ్‌గా జరుగుతున్న ఎంపిక ప్రక్రియను అమెరికాలోని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయి. అమెరికా ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనం కంటే తక్కువ వేతానికి వచ్చే విదేశీ ఉద్యోగులనే ఆ కంపెనీలు మొదట రప్పించుకుంటున్నాయి” అని తెలిపారు.