Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న యూనస్

‘హింస మన శత్రువు. మరింత మంది శత్రువులను సృష్టించుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి.. దేశాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉండండి’ అని అన్నారు.

Nobel laureate Muhammad Yunus

నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త ముహమ్మద్ యూనస్ ఇవాళ బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చి ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో ఆయన మధ్యాహ్నం 2.10 గంటలకు ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అనంతరం బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌తో భేటీ అవుతారు. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల వల్ల చెలరేగిన హింసతో మాజీ ప్రధాని షేక్ హసీనా సైనిక విమానంలో దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో యూనస్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. బుధవారం ఆయన బంగ్లాదేశ్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు.

‘హింస మన శత్రువు. మరింత మంది శత్రువులను సృష్టించుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి.. దేశాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉండండి’ అని అన్నారు. తాత్కాలిక ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ సాయంత్రం జరుగుతుందని ఇప్పటికే బంగ్లాదేశ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ ప్రకటించారు.

ఈ తాత్కాలిక ప్రభుత్వం దాదాపు 15 మంది సభ్యులు ఉండవచ్చని తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇవాళ మధ్యాహ్నం నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ, యూనస్ ఇవాళ మధ్యాహ్నం 2.10 గంటలకు దేశానికి చేరుకునే అవకాశం ఉండడంతో సాయంత్రం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Also Read: రెజ్లింగ్‌కు గుడ్ బై అంటూ వినేశ్ ఫొగట్ ట్వీట్.. భావోద్వేగభరిత కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు