Nobel Peace Prize 2020: యమెన్ నుంచి ఉత్తరకొరియా వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆకలితీర్చుతున్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(WFP)కి 2020 ఏడాదికిగాను నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. శుక్రవారం(అక్టోబర్-9,2020)నోబెల్ కమిటీ ఈ విషయాన్ని ప్రకటించింది.
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో డబ్ల్యూఎఫ్‌పీ ప్రపంచ వ్యాప్తంగా ఆకలి చావుల నివారణకు ప్రయత్నించింది. అంతర్ యుద్ధంతో రగులుతున్న ప్రాంతాల్లో శాంతి నెలకొల్పేందుకు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎంతో కృషిచేసినట్లు నోబెల్ కమిటీ చైర్ ఉమెన్ బెరిట్ రియిస్ అండర్సన్ చెప్పారు.
WFP..యుద్ధ ప్రాంతాల్లో ఆకలిని ఆయుధంగా మార్చుకుని శాంతిని స్థాపనకు కృషిచేసినట్లు కమిటీ చెప్పింది. శాంతి స్థాపన కోసం ఫుడ్ సెక్యూర్టీ కీలకమైందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నిరూపించినట్లు నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను కూడా ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యులను చేసేందుకు డబ్ల్యూఎఫ్‌పీ ప్రయత్నించినట్లు నోబెల్ కమిటీ పేర్కొన్నది.
మానవాళిని పీడిస్తున్న ఆకలి సమస్యను పరిష్కరించేందుకు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అతిపెద్ద కార్యక్రమాన్ని చేపట్టినట్లు నోబెల్ కమిటీ పేర్కొన్నది. 2019లో 88 దేశాల్లో ఆకలితో అలమటిస్తున్న సుమారు వంద మిలియన్ల మందికి ఆహారాన్ని అందించినట్లు నోబెల్ కమిటీ ప్రశంసించింది.
కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆకలి సమస్యలు పెరిగినట్లు కమిటీ తెలిపింది. అయితే ఇటువంటి విపత్కర సమయంలో డబ్ల్యూఎఫ్‌పీ తన సామర్ధ్యాన్ని పెంచి సేవలను అందించినట్లు కమిటీ వెల్లడించింది.