Aspirin : సూపర్ గుడ్ న్యూస్..! ఆస్పిరిన్‌తో క్యాన్సర్‌కు చెక్..! పరిశోధనలో వెలుగుచూసిన కీలక విషయాలు..

భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్స విధానాన్ని ఈ అధ్యయనం మార్చగలదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Aspirin : మానవాళిని భయపెడుతున్న అత్యంత ప్రాణాంతక వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. పలు రకాల క్యాన్సర్లు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు కారణం అవుతున్నాయి. క్యాన్సర్ ను నివారించే మందుల తయారీ కోసం శాస్త్రవేత్తల విస్తృత పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని ఆపడం చాలా కాలంగా ఒక సవాల్ గా మారింది.

క్యాన్సర్ బారిన పడ్డారంటే మరణం తప్పదనే ఆందోళన నెలకొన్న ఈ పరిస్థితుల్లో పరిశోధకులు సూపర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఓ సాధారణ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ క్యాన్సర్ కు చెక్ పెడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఆ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఆస్పిరిన్. అవును.. ఈ నొప్పి నివారిణి మాత్రకు క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టగల పవర్ ఉందని పరిశోధనలో వెలుగుచూసిందట.

క్యాన్సర్ కణాలు పెరగకుండా, వ్యాప్తి చెందకుండా ఈ ట్యాబ్లెట్ అడ్డుకుంటుందట. దాంతో మరణం సంభవించకుండా కాపాడుతుందట. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్స విధానాన్ని ఈ అధ్యయనం మార్చగలదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అత్యంత సాధారణ నొప్పి నివారణ మందులలో ఒకటైన ఆస్ప్రిన్.. క్యాన్సర్‌ను మెటాస్టాసైజింగ్ నుండి నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.

క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందినప్పుడు శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుంది? అనేది తెలుసుకోవడానికి ప్రయోగం చేపట్టగా.. క్యాన్సర్ కణాల వ్యాప్తిని ఆస్పిరిన్ డ్రగ్ అడ్డుకుంటుందనే విషయాన్ని కనుగొన్నారు. నొప్పి నివారిణి ఆస్పిరిన్ క్యాన్సర్ నివారిణిగానూ ఉపయోగపడుతందని తెలుసుకున్నారు.

Also Read : స్మార్ట్‌ఫోన్‌తో 7 సెకన్లలోనే గుండె పరీక్ష.. ఈ ఏఐ యాప్‌‌తో సాధ్యమే అంటున్న 14 ఏళ్ల బాలుడు.. ఎవరీ సిద్ధార్థ్..?!

ఆస్పిరిన్ మాత్ర వాడకం శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుందని, తద్వారా క్యాన్సర్ కణాలను తగ్గిస్తుందని అధ్యయనంలో కనుగొన్నారు. క్యాన్సర్ పేషెంట్లు తక్కువ డోస్ తో కూడిన ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ రెగులర్ గా వాడటం.. బ్రెస్ట్, ప్రోస్టేట్, పేగు సంబంధ క్యాన్సర్ కణాల వ్యాప్తిని తగ్గించిందని పరిశోధనల్లో తేలింది. కొన్నేళ్లుగా ప్రతిరోజు ఆస్పిరిన్ డ్రగ్ వాడుతున్న వారు క్యాన్సర్ బారిన పడినా, ఎక్కువరోజులు బతికే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం చెబుతోంది.

మన శరీరంలో T కణాలు క్యాన్సర్ తో పోరాడతాయి. క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందకుండా ముందే వాటిపై దాడి చేసి అడ్డుకుంటాయి. అయితే రక్తం గడ్డ కట్టేందుకు తోడ్పడే ప్లేట్‌లెట్లు ఈ T కణాలకు అడ్డు తగులుతున్నాయి. దీంతో క్యాన్సర్ కణాలు ప్రవేశించినా వాటితో పోరాడేందుకు T కణాలకు అవకాశం లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో ఆస్పిరిన్ పనికొస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ప్లేట్‌లెట్లు పక్కదారి పడతాయని, దీంతో T కణాలు స్వేచ్ఛగా ఉండి క్యాన్సర్ కణాలపై వెంటనే దాడి చేస్తాయని వివరించారు.

”ఇది పూర్తిగా ఊహించని ఆవిష్కరణ. మేము ఊహించిన దానికంటే పూర్తిగా భిన్నమైన ఫలితం వచ్చింది” అని కేంబ్రిడ్జ్ అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ జీ యాంగ్ అన్నారు. ఆస్ప్రిన్ లేదా ఇలాంటి మందులు.. ఖరీదైన యాంటీబాడీ ఆధారిత చికిత్సలకు మరింత సరసమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలవని ఆయన గుర్తించారు.

ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. ఆస్పిరిన్ వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని పరిశోధకులు హెచ్చరించారు. ఆస్పిరిన్ అతిగా వాడితే కొందరిలో అంతర్గత రక్తస్రావం లేదా కడుపు పూతల వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కలగవచ్చన్నారు. ఏది ఏమైనా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో ఆస్పిరిన్ గేమ్ ఛేంజర్‌గా మారవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.