Asim Munir: భారత్ చాలా కాలం క్రితం త్రివిధ దళాలను ఏకీకృతం చేసిన విషయం తెలిసిందే. సైన్యం, వైమానిక, నౌకా దళాల మధ్య సమన్వయానికి భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)ను పదవిని సృష్టించింది. ఇప్పుడు పాకిస్థాన్ కూడా ఇటువంటి పనే చేస్తోంది.
కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ (సీడీఎఫ్) పేరిట కొత్త పదవిని సృష్టించడానికి పాకిస్థాన్ సర్కారు నిన్న పార్లమెంటులో 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టింది. అందులోని ఆర్టికల్ 243లో మార్పులను ప్రతిపాదించింది.
అసీం మునీర్ నవంబరు 28నే రిటైర్ కావాల్సి ఉంది. ఆయనను పాక్ ప్రభుత్వం సీడీఎఫ్‌గా నియమించనుంది. దీంతో ఆయన పాకిస్థాన్ సైన్యంపై మరింత పట్టు సాధించవచ్చు. ఈ పదవి సైన్యం, వైమానిక, నౌకా దళాల మధ్య మూడు దళాల సమన్వయానికి, ఏకీకృత ఆదేశ వ్యవస్థకు దోహదం చేస్తుందని పాక్ ప్రభుత్వం అంటోంది.
సైన్యాధ్యక్షుడు రక్షణ దళాధిపతిగా కూడా వ్యవహరించి, ప్రధానమంత్రితో సంప్రదించి జాతీయ వ్యూహాత్మక కమాండ్ అధిపతిని నియమిస్తారని బిల్లులో పేర్కొన్నారు. ఆ అధిపతి పాక్ సైన్యానికి చెందినవారై ఉంటారని పేర్కొంది.
కొన్ని నెలల క్రితం పాక్ ప్రభుత్వం అసీం మునీర్‌కు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి ఇచ్చింది. పాక్ చరిత్రలో ఈ బిరుదు ఇవ్వడం రెండోసారి మాత్రమే. ఈ హోదాతో అసీం మునీర్‌కు జీవితాంతం అనేక సదుపాయాలు ఉంటాయి.
చట్టం ప్రకారం ప్రభుత్వం.. సైన్యంలో ఉన్నవారిని ఫీల్డ్ మార్షల్, ఎయిర్ ఫోర్స్ మార్షల్, నావికాదళ అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ హోదాలకు ప్రమోట్ చేయవచ్చు. ఫీల్డ్ మార్షల్ హోదా జీవితకాలం కొనసాగుతుంది.
జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవి 2025 నవంబర్ 27న ముగుస్తుందని బిల్లులో పేర్కొన్నారు. దీంతో మునీర్ ఆధ్వర్యంలో ఉన్న కమాండ్ నిర్మాణంలోనే సైన్యాధికారాలు ఏకీకృతం అవుతున్నాయి.