పాకిస్తాన్ నైజం : దాడితో సంబంధం లేదన్నపాక్ మేజర్ జనరల్

  • Publish Date - February 22, 2019 / 04:07 PM IST

పాకిస్తాన్ నైజం మరోసారి బైటపెట్టుకుంది. పుల్వామా ఉగ్రదాడిలో ఆ దేశం హస్తం ఉందని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టంగా చెప్పినా..ఆ దేశపు మేజర్ జనరల్ ఆసిఫ్ గపూర్ మాత్రం ఈ దాడితో తమకి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. ఓ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తమ అసత్యాలవాదన విన్పించారు. ఎల్ఓసీ దగ్గర భారీగా భారతదేశపు సైన్యం పహరా కాస్తుంటే మేమెలా దాన్ని అతిక్రమించి దాడి చేయగలమని ప్రశ్నించారు. అలానే అక్కడ దాడికి వాడిన వాహనం పాకిస్తాన్‌ది కాదని..దాడి చేసిన వ్యక్తి పాక్ జాతీయుడు కాదని అడ్డగోలుగా  వాదించారు. 

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా ధీటుగా బదులిస్తామని పాకిస్తాన్‌ హెచ్చరించింది. అయితే తాము యుద్ధానికి సన్నద్ధంగా లేమని… భారత్‌ మాత్రం కయ్యానికి కాలుదువ్వుతోందని పాక్‌ సైనిక దళాల ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనతో పాకిస్తాన్‌ ప్రమేయం లేకపోయినప్పటికీ భారత్‌ తమపై నింద వేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై భారత్‌ వివరణ ఇవ్వాలన్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడింది కశ్మీర్‌కు చెందిన యువకుడేనని ఆయన స్పష్టం చేశారు.