మూసూద్ పై చర్యలకు ఆదేశించిన పాక్

భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్  ఉగ్రసంస్థ చీఫ్ మసూద్‌ అజహర్‌ ను బుధవారం(మే-1,2019) గ్లోబల్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సందర్భంగా అతడిపై పాకిస్థాన్‌ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల ప్రకారం మసూద్ ఆస్తులను ఫ్రీజ్ చేయాలని,అతడిపై ట్రావెల్ బ్యాన్ విధించాలని ఇమ్రాన్ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ఆయుధాల కొనుగోలు, విక్రయాలు జరపకుండా ఆంక్షలు విధించింది. ఈ మేరకు పాకిస్తాన్‌ ప్రభుత్వం ఓ అధికారిక నోటిఫికేషన్‌ ను జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ 1267 ఆంక్షల కమిటీ నిబంధనలకు అనుగుణంగా మసూద్‌ పై తగు చర్యలు తీసుకుంటున్నామని నోటిఫికేషన్‌ లో తెలిపారు. మసూద్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ మండలి తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నామని ప్రకటించిన పాక్‌.. అతడిపై వెంటనే ఆంక్షలను అమలుచేస్తామని బుధవారం ఆ దేశ విదేశాంగశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

అంతకుముందు పుల్వామా ఉగ్రవాద దాడిని మసూద్‌ తో ముడిపెట్టడం వంటి రాజకీయ ప్రస్తావనలను తొలగించాకే ఐరాస తీర్మానానికి ఆమోదం తెలిపినట్లు పాక్‌ తెలిపింది. దీనిపై వివరణ ఇచ్చిన భారత విదేశాంగ శాఖ మసూద్‌ ఉగ్రవాద కార్యకలాపాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరవాతే ఐరాస నిర్ణయం వెలువడిందని తెలిపింది. అంతర్జాతీయ వేదికపై తనకు తగిలిన ఎదురుదెబ్బ నుంచి దృష్టి మళ్లించడానికే పాక్‌ తప్పుడు వాదనలు తెరపైకి తెస్తోందని తెలిపింది.