భారత్ కు అప్పగించకుండా…ఉగ్రవాదికి పాక్ సంతతి బ్రిటన్ హోంమంత్రి సాయం

అండర్ వరల్డ్ డాన్,మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, మొహమ్మద్ హనీఫ్ ఉమర్జీ పటేల్ అలియాస్ టైగర్ హనీఫ్(57) ని తమకు అప్పగించాలని కోరిన భారత్ విజ్ణప్తిని బ్రిటన్ ప్రభుత్వం తిరస్కరించింది. పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రిటన్ మాజీ హోంమంత్రి సాజిద్ జావిద్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న విషయాన్ని బ్రిటన్ హోంశాఖ  ధ్రువీకరించింది. 

భారత్-బ్రిటన్ ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం కింద…భారత్  రెండవ కేటగిరీ దేశం. అంటే నేరస్థుల అప్పగింత విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకునే అధికారం బ్రిటన్ హోంమంత్రికే పూర్తిగా ఉంటుంది. ఆ అధికారాన్ని ఉపయోగించుకునే సాజిద్ జావిద్.. ఉగ్రవాది టైగర్ హనీఫ్‌ను ఆదుకున్నారు.

 1993లో గుజరాత్ లోని సూరత్ లో జరిగిన రెండు బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో నిందితుడిగా ఉండి దేశం వదిలిపారిపోయిన హనీఫ్ ను… 2010 ఫిబ్రవరిలో బ్రిటన్ లోని గ్రేట్ మాంచెస్టర్ సిటీలోని ఓ గ్రాసరీ స్టోర్ లో గుర్తించిన స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు అప్పగింత వారెంట్(extradition warrant)పై అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే భారత్‌ లో తనను చిత్రహింసలకు గురిచేసే అవకాశం ఉందని వాదిస్తూ భారత్ కు అప్పగింతను కొంతకాలం హనీఫ్ తప్పించుకున్నాడు.

అయితే 2012 జూన్ లో అప్పటి హోంమంత్రి,మాజీ బ్రిటన్ ప్రధాని థెరెసా మే మొదటగా హనీఫ్ ను భారత్ కు అప్పగించేందుకు ఆదేశాలు జారీచేశారు. ఆ తర్వాత న్యాయపోరాటాలు మొదలయ్యాయి. అయితే బ్రిటన్ లో ఉండేందుకు హనీఫ్ వరుసగా చేసిన అన్ని న్యాయపోరాటాలు విఫలమవడంతో చివరగా 2019లో పాక్ సంతతికి చెందిన అప్పటి బ్రిటన్ హోంమంత్రి సాజిద్ కు హనీఫ్ చేసుకున్న రిక్వెస్ట్ ఫలించింది. 2019లో నాటి హోం మంత్రి అయిన పాక్ సంతతికి చెందిన సాజిద్ జావిద్…హనీఫ్ ను అప్పగించాలంటూ భారత్ చేసిన విజ్ఞాపనను తిరస్కరించారని,ఆగస్టు 2019లో హనీఫ్ కోర్టు నుంచి విడుదలైనట్లు ఆదివారం యూకే హోంశాఖ వర్గాలు ధ్రువీకరించాయి.