Pak Army Chief Wife
Pak Army Chief Wife: ఈనెల 29న పదవీ విరమణ చేయనున్న పాకిస్థాన్ ఆర్మీచీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరేళ్ల పదవీకాలంలో అతని కుటుంబం, బంధువులు బిలియనీర్లుగా మారారని, వారు మొత్తం 12.7 బిలియన్ల ఆస్తులను సంపాదించారని పాకిస్థాన్‌కు చెందిన ఫాక్ట్‌ఫోకస్ వెబ్‌సైట్ వెల్లడించింది. 2013 నుండి 2021 వరకు జనరల్ బజ్వా, అతని కుటుంబానికి చెందిన ఆస్తిపత్రాలను షేర్ చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆరేళ్లలో ఆర్మీచీఫ్ ఇన్నిబిలియన్ల ఆస్తులు ఎలా సంపాదించారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నారు.
మరోవైపు ఆర్మీ చీఫ్ సతీమణి అయేషా అమ్జాద్ ఆస్తులుసైతం ఆరేళ్లలో భారీగా పెరిగాయి. నివేదిక ప్రకారం.. పాక్, ఇతర దేశాల్లో వెలుపల ఉన్న ఆర్మీ చీఫ్ ఆస్తులు, వ్యాపారాల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం.. రూ. 12.7 బిలియన్లు. అయితే, ఆయన సతీమణి అయేషా అమ్జాద్ ఆస్తులు 2016లో జీరోగా ఉన్నాయి. కానీ ఆరేళ్ల కాలంలో ఆమె ఆస్తులు రూ. 2.2 బిలియన్లకు చేరుకున్నట్లు పాక్‌కు చెందిన ఫాక్ట్ ఫోకస్ వెబ్ సైట్ వెల్లడించింది. అయితే, ఈ మొత్తంలో ఆమె భర్తకు సైన్యం ఇచ్చిన నివాస ప్లాట్లు, వాణిజ్య ప్లాట్లు, ఇళ్ల వివరాలు లేవు. ఇదిలాఉంటే ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా కుటుంబ సభ్యుల పన్ను సమాచారాన్ని అక్రమంగా లీక్ చేయడం పట్ల పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ స్పందించారు. వెంటనే సంబంధించిన కథనం ప్రచురించిన సంస్థపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఆర్మీచీఫ్ ఆస్తుల వివరాలు వెల్లడించిన వెబ్ సైట్ ను బ్లాక్ చేశారు.
ఇక మహనూర్ సబీర్ (జనరల్ బజ్వా కోడలు) ఆస్తుల మొత్తం విలువ అక్టోబర్ 2018 చివరి వారంలో జీరో కాగా.. నవంబర్ 2018 నాటికి రూ. 1,271 మిలియన్లకు చేరుకోగా, మహనూర్ సోదరి హమ్నా ఆస్తులు రూ. నసీర్ 2016లో సున్నా నుంచి 2017 నాటికి బిలియన్లకు చేరుకున్నట్లు వెబ్ సైట్ పేర్కొంది. ఆర్మీ చీఫ్ కొడుకు మామ సబీర్ హమీద్ పన్ను రిటర్న్‌లు 2013లో మిలియన్ కంటే తక్కువగా ఉన్నాయి, అయితే ఆరేళ్లలో అతను బిలియనీర్ అయ్యాడని వెబ్‌సైట్ పేర్కొంది.
మరోవైపు పాకిస్థాన్ ఆర్మీచీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. కొత్త ఆర్మీ చీఫ్ పేరును ప్రకటించేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఐదు పేర్లతో కూడిన జాబితాను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపింది. వీరిలో లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్, లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా, లెఫ్టినెంట్ జనరల్ అజార్ అబ్బాస్, లెఫ్టినెంట్ జనరల్ నోమన్ మెహమూద్, లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పదవికి పోటీ పడ్డారు.