×
Ad

నకిలీ ‘పిజ్జా హట్’ ప్రారంభోత్సవానికి వెళ్లి నవ్వులపాలైన పాక్‌ రక్షణ మంత్రి.. ఏంటయ్యా ఇదీ..

సియాల్కోట్ కంటోన్మెంట్‌లో పిజ్జా హట్ పేరు, బ్రాండింగ్‌ను తప్పుడు రీతిలో వినియోగిస్తూ ఒక అనధికారిక అవుట్‌లెట్ ప్రారంభమైంది.

Khawaja Asif (Image Credit To Original Source)

  • సియాల్కోట్‌లో నకిలీ ‘పిజ్జా హట్’
  • నకిలీదని తెలియకుండా ప్రారంభోత్సవానికి మంత్రి
  • ఆ అవుట్‌లెట్‌కు, తమకు సంబంధం లేదన్న ‘పిజ్జా హట్’

Pakistan: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల సియాల్కోట్‌లో ఒక ‘పిజ్జా హట్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ జరుగుతోంది. ‘పిజ్జా హట్’ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొనడం తప్పేమీకాదు. అయితే, ఆ అవుట్‌లెట్‌ నకిలీదని తేలడంతో ఖవాజా ఆసిఫ్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఏం జరిగింది?
‘పిజ్జా హట్’ అమెరికాకు చెందిన ఆహార సంస్థ. సియాల్కోట్‌లో ఓ వ్యాపారి ‘పిజ్జా హట్’ పేరు పెట్టుకుని అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. దీనికి ఏకంగా ఖవాజా ఆసిఫ్ ప్రారంభోత్సవం చేయడంతో అందరి దృష్టి దీనిపై పడింది.

ఈ విషయాన్ని గుర్తించిన ‘పిజ్జా హట్’ ఈ అవుట్‌లెట్‌ను “అనధికారికం” అని ప్రకటిస్తూ, దీనితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సియాల్కోట్ కాంటోన్మెంట్‌లోని ఆ అవుట్‌లెట్‌కు తమ పేరు పెట్టుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెప్పింది. దీనిపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినట్టు కూడా వెల్లడించింది.

“గమనిక: సియాల్కోట్ కంటోన్మెంట్‌లో పిజ్జా హట్ పేరు, బ్రాండింగ్‌ను తప్పుడు రీతిలో వినియోగిస్తూ ఒక అనధికారిక అవుట్‌లెట్ ప్రారంభమైంది. ఈ అవుట్‌లెట్‌కు పిజ్జా హట్ పాకిస్థాన్ లేదా యమ్! బ్రాండ్స్‌తో ఎలాంటి సంబంధమూ లేదు.

Also Read: నువ్వు తోపు తాత.. 70 ఏళ్ల వయసులో ఇంటర్నెట్ సంచలనంగా మారిన వృద్ధుడు.. ఏం చేశాడంటే?

ఇది పిజ్జా హట్ అంతర్జాతీయ వంటక విధానాలు, నాణ్యతా ప్రమాణాలు, ఆహార భద్రత నియమాలు పాటించదు. ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశాం” అని సంస్థ సోషల్ మీడియాలో పిజ్జా హట్ పేర్కొంది. యమ్ బ్రాండ్స్ అంటే పిజ్జా హట్‌ మాతృ సంస్థ. ఇది అమెరికా బహుళజాతి ఫాస్ట్ ఫుడ్ కంపెనీ.

ప్రస్తుతం “పిజ్జా హట్ పాకిస్థాన్‌” కింద 16 అధికారిక అవుట్‌లెట్లు మాత్రమే ఉన్నాయని చెప్పింది. వీటిలో 14 లాహోర్‌లో, 2 ఇస్లామాబాద్‌లో ఉన్నట్లు వివరించింది.

సోషల్ మీడియాలో స్పందన ఎలా ఉంది?
“ఈ విషయం మంత్రికి తెలియలేదా?” సామాజిక మాధ్యమాల్లో ఒకరు ప్రశ్నించారు. మరో యూజర్ స్పందిస్తూ “ప్రభుత్వ బడ్జెట్ వృథా” అని వ్యాఖ్యానించారు. మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. “నేను నిన్నే అక్కడికి వెళ్లాను, ఏదీ సరిగా లేదు. ఇదేంటని అప్పుడే అనిపించింది. ఇప్పుడు చూస్తే ఇది మోసంలా ఉంది” అని రాశారు.