Pakistan Water: నీళ్ల కోసం పాకిస్తాన్ కాళ్ల బేరం.. దాహం తీర్చాలంటూ భారత్‌కు విన్నపం..

నీళ్లు, రక్తం ఒకే దారిలో ప్రవహించవు అంటూ.. సింధు జలాల విషయంలో నో కాంప్రమైజ్ అనే సందేశాన్ని పాకిస్తాన్ కు గట్టిగానే ఇచ్చారు ప్రధాని మోదీ..

Pakistan Water: సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్.. భారత్ తో కాళ్ల బేరానికి వచ్చింది. సింధు జలాల ఒప్పందం రద్దును పున:సమీక్షించాలని వేడుకుంది. చుక్క నీరు లేక అల్లాడుతున్న పాకిస్తాన్..నీళ్లు ఇవ్వండి మహాప్రభో అంటూ భారత్ శరణు కోరింది. పాపాలన్నీ చేసి కర్మ అనుభవిస్తూ ఇప్పుడు దాహం దాహం దేహి అంటూ దేబిరిస్తోంది. వాటర్ ప్లీజ్ అంటూ లెటర్ రాసింది. పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ భారత జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. చర్చలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సున్నితమైన నిర్ణయాన్ని పున: పరిశీలించాలని అభ్యర్థించారు. అయితే, కేంద్రం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫస్ట్ యాక్షన్ గా దౌత్య యుద్ధాన్ని ప్రకటించింది భారత్. ఇందులో ఫస్ట్ మిస్సైల్ గా సింధు జలాల నిలిపివేతనే ప్రయోగించింది. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేయడమే కాదు వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది.

చుక్క నీరు కూడా విడుదల చేయకుండా డ్యామ్ లను మూసివేసింది. సింధు నది, దాని ఉప నదుల నుంచి పాక్ కు చుక్క నీరు కూడా పోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోంటోంది. భారత్ కు లేఖ రాసిది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దుపై పున: సమీక్షించాలని లేఖలో కోరినట్లు తెలుస్తోంది. భారత్ ఈ విషయంలో మళ్లీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం తాము తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని పాక్ విజ్ఞప్తి చేసింది.

పాకిస్తాన్ దేహీ అంటున్నా.. పాపిష్టి పనులకు పరిహారం చెల్లించుకోక తప్పదనే సంకేతాలు ఇస్తోంది భారత్. సింధు జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే ప్రధాని మోదీ ఖరాఖండీగా తేల్చి చెప్పేశారు. ఉగ్రవాదానికి, నీళ్లకు ముడి పెట్టేశామని.. టెర్రరిజానికి అడ్డాగా ఉన్న పాకిస్తాన్ కు నీళ్లు ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చేశారు.

Also Read: రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్.. పాక్ కరాచీ పోర్ట్ లక్ష్యంగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములను మోహరించిన భారత్..

నీళ్లు, రక్తం ఒకే దారిలో ప్రవహించవు అంటూ.. సింధు నీళ్ల విషయంలో నో కాంప్రమైజ్ అనే సందేశాన్ని పాకిస్తాన్ కు గట్టిగానే ఇచ్చారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి నీళ్లను అలాగే నిలిపివేశారు కూడా. దాదాపు 10 రోజులు కావడంతో పాక్ గొంతు ఎండిపోయింది. పొలాలు బీటలు వారుతున్నాయి. మండు వేసవిలో దాహంతో పాక్ అల్లాడిపోతోంది. దీంతో నీళ్ల కోసం కాళ్ల బేరానికి వచ్చింది.