INS Vikrant: రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్.. పాక్ కరాచీ పోర్ట్ లక్ష్యంగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములను మోహరించిన భారత్..
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పై త్రిముఖ ఒత్తిడి వ్యూహాన్ని ప్రయోగించామని నావికాదళ అధికారులు తెలిపారు.

INS Vikrant: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఉగ్రవాద శిబిరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. వాటిని నేలమట్టం చేసింది. భారత్ చేసిన మెరుపు దాడుల్లో 100మందికిపైగా టెర్రరిస్టులు హతమయ్యారు. మొత్తంగా ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయినట్లు భారత్ ప్రకటించింది.
ఆపరేషన్ సిందూర్ తో పాక్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉన్నట్లు పసిగట్టిన భారత నావికాదళం సముద్ర సంసిద్ధతను గణనీయంగా పెంచడానికి పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాక్‌లోని కరాచీ పోర్ట్ ను టార్గెట్ చేసింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ ను రంగంలోకి దింపింది. బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను అరేబియన్ సముద్రంలో మోహరించింది. అలా ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పై త్రిముఖ ఒత్తిడి వ్యూహాన్ని ప్రయోగించామని నావికాదళ అధికారులు తెలిపారు. కరాచీ పోర్ట్‌ను లక్ష్యంగా చేసుకొని 36 ఫ్రంట్‌లైన్ నావికా దళాలను మోహరించామన్నారు. వీటిలో బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన 7 డిస్ట్రాయర్లు, మీడియం-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులు, వరుణాస్త్ర హెవీ వెయిట్ టార్పెడోలు ఉన్నాయి. వీటిలో కొత్తగా ప్రవేశపెట్టిన INS తుషిల్‌తో సహా 7 స్టెల్త్ గైడెడ్-క్షిపణి యుద్ధనౌకలను సైతం మోహరించినట్లు వెల్లడించారు.
Also Read: ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించిన భారత్.. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే..?
ఐఎన్‌ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్ట్ ను దిగ్బంధించడతో పాక్ నావికాదళం సమర్థవంతంగా ప్రతి స్పందించలేకపోయిందని.. కేవలం నౌకాశ్రయానికే పరిమితమవ్వాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది చనిపోయారు. వారిలో ఎక్కువగా పర్యాటకులు ఉన్నారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత సాయుధ దళాలు మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. తదనంతరం, రెండు దేశాలు ఒకదానికొకటి సైనిక చర్యలకు దిగాయి. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు, వారి సహచరులు ఖతమయ్యారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మే 8న జరిగిన అఖిలపక్ష సమావేశంలో చెప్పారు. అనంతరం భారత్, పాక్ లు మే 10న కాల్పుల విరమణకు ఒక అవగాహనకు వచ్చాయి.