పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ ఇచ్చింది విద్యుత్ సరఫరా కంపెనీ. సాక్షాత్తు దేశ ప్రధాని ఆఫీస్ కు పవర్ కట్ చేస్తామంటూ నోటీస్ పంపించింది. ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ జారీ చేసిన నోటీస్.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. పాకిస్తాన్ లో పరిస్థితిని తెలుపుతుంది.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆయన ఆఫీస్ అయిన సెక్రటేరియట్ కరెంట్ బిల్లు కట్టలేదు. ఏకంగా రూ.41 లక్షలు బాకీ పడింది. ఇన్ఫామ్ చేసినా పట్టించుకోవటం లేదని.. ఏకంగా నోటీస్ ఇచ్చింది. బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది కంపెనీ. నోటీస్ పంపినా స్పందన లేదంట. ఇక వైర్లు కట్ చేయటమే మిగిలింది అని కంపెనీ ప్రకటించటం విశేషం.
పాకిస్థాన్ లో విద్యుత్ సంక్షోభం కొనసాగుతుంది. ఉత్పత్తి – సరఫరా మధ్య భారీ వ్యత్యాసంతోపాటు బిల్లుల బాకీలు కూడా ఉత్పత్తి కంపెనీలను నష్టాల్లోకి నెట్టారు. 2018లో ఇమ్రాన్ సర్కార్ పెట్రోలు, డీజిల్‌లపై ఐదు రూపాయలకు పైగా ధరలు పెంచింది. దేశంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచి పాక్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా తీసుకున్న చర్యలు కూడా ఫలితం ఇవ్వలేదు. విద్యుత్ వ్యవస్థ క్రమబద్దీకరణతో.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానన్న ఇమ్రాన్ ఖాన్.. ఏకంగా అదే విద్యుత్ శాఖ నుంచి అభాసుపాలు అయ్యారు. హామీ ఇచ్చిన అతనే.. 41 లక్షల రూపాయలు బకాయి పడి.. నోటీస్ అందుకున్నారు.