Pakistan Donkeys: చైనా కారణంగా పాకిస్తాన్ ప్రజలకు గాడిద కష్టాలు.. అసలు చైనాకు, పాక్ గాడిదలకు లింకేంటి..

గాడిదల కొనుగోలుకు కఠినమైన నియమాలు ఉండాలని అంటున్నారు.

Pakistan Donkeys: చైనా కారణంగా పాకిస్తాన్ ప్రజలు గాడిద కష్టాలు పడుతున్నారు. డ్రాగన్ కంట్రీ వల్ల తమ జీవనోపాధిని కోల్పోయామని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అసలు చైనాకు, పాకిస్తాన్ లో ఉండే గాడిదలకు లింకేంటి? పాక్ ప్రజలు ఎందుకు బాధపడుతున్నారు? అనే వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ కు చెందిన రషీద్ చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల అతడి గాడిద(దాని పేరు టైగర్) రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. దీంతో రషీద్ ఉపాధి కోల్పోయాడు. గాడిద బండే అతడి జీవనాధారం. దాని మీద వచ్చే డబ్బుతో అతడు తన ఇంటిని నడుపుతున్నాడు. గాడిద చనిపోతే మరో దాన్ని కొనుక్కోవచ్చు కదా అనే సందేహం రావొచ్చు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. పాకిస్తాన్ లో గాడిధ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్కడ ఒక్కో గాడిద ఖరీదు అక్షరాల 2 లక్షల రూపాయలుగా ఉంది. అసలే నేను పేదవాడిని, 2 లక్షలు పెట్టి గాడిదని కొనేంత స్థోమత తనకు లేదని రషీద్ వాపోయాడు. కాగా, ఎనిమిదేళ్ల క్రితం తాను 30వేలకే గాడిదను కొన్నానని, ఇప్పుడు దాని ధర 2లక్షలుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు రషీద్.

ఇది ఒక్క రషీద్ సమస్య మాత్రమే కాదు. ఆ దేశంలో చాలా మంది పేదలు గాడిద బండ్లపైనే ఆధారపడి బతుకుతున్నారు. గాడిద బండి నడిపి దానిపై వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. రోజువారీ సంపాదన కోసం గాడిదలపై ఆధారపడే అనేక మంది పేద కార్మికులు కూడా ఇదే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కొత్త గాడిదను కొనేంత డబ్బు తమ దగ్గర లేదని వాపోతున్నారు.

అసలు గాడిదల ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయి? దానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే.. గాడిదల ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం చైనా అని తేలింది. గాడిద చర్మాన్ని ఉపయోగించి ఎజియావో అనే సాంప్రదాయ ఔషధాన్ని తయారు చేస్తుంది చైనా. ఈ ఔషధం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, అలసట, కణితులను తగ్గించడానికి, రక్తహీనతకు చికిత్స చేయడానికి సాయపడుతుందని చైనీయులు నమ్ముతారు.

చైనాలో ఎజియావో పరిశ్రమ భారీ వృద్ధిని చూసింది. అయితే, స్వదేశంలో తగినంత గాడిదలు లేకపోవడంతో, చైనా కొనుగోలుదారులు పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. పాక్ లో గాడిదలు చౌకగా, సులభంగా దొరుకుతుండటమే ఇందుకు కారణం.

Also Read: యువత ప్రాణాలు తీస్తున్న కొత్త సోషల్ మీడియా ఛాలెంజ్.. అసలేంటీ డస్టింగ్ ఛాలెంజ్, ఎందుకు ప్రాణాంతకం, ఎలా చనిపోతారు?

కరాచీలో వైద్య కేంద్రాన్ని నడుపుతున్న డాక్టర్ గువో జింగ్ ఫెంగ్ దీనిపై స్పందించారు. చైనాకు గాడిద చర్మాల అవసరం పెరుగుతోందన్నారు. ఇదిప్పుడు ప్రపంచ వాణిజ్యం అని ఆయన అన్నారు. పాకిస్తాన్‌లోని అతిపెద్ద గాడిద మార్కెట్ అయిన లైరి మార్కెట్‌లో కూడా ధరలు పెరిగాయి. చౌకైన ఆరోగ్యకరమైన గాడిద ధరే 1.55 లక్షలగా ఉందని రషీద్ వాపోయాడు. “నేను దాన్ని ఎలా కొనగలను? నేను ఏదో ఒక విధంగా ఒకటి కొన్నా, నా పెట్టుబడిని తిరిగి పొందేలోపు అది చనిపోతే నేను ఏం చేయాలి” అని ఆవేదనకు గురయ్యాడు.

పాకిస్తాన్‌లోని ఇటుక బట్టీలు, వ్యవసాయం నుండి రవాణా, లాండ్రీ సేవల వరకు అనేక పరిశ్రమలకు గాడిదలు చాలా ముఖ్యమైనవి. సమద్ వంటి కార్మికులు కఠినమైన రోడ్లపై భారీ వస్తువులను మోయడానికి వాటిని ఉపయోగిస్తారు. రోజుకు రూ. 1,500-2,000 సంపాదిస్తారు. అందులో సగం జంతువు ఆహారానికి, వాటి సంరక్షణకు పోతుంది. దాదాపు 5.9 మిలియన్ల పని చేసే గాడిదలతో.. ఇథియోపియా, సూడాన్ తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద గాడిద జనాభాకు పాకిస్తాన్ నిలయం.

ఏప్రిల్ 2025లో, చైనా ప్రతినిధి బృందం పాకిస్తాన్ ఆహార భద్రతా మంత్రితో సమావేశమై గాడిద ఫార్మ్స్ ఏర్పాటు చేయడం గురించి చర్చించింది. స్థానిక కార్మికులను సంరక్షణ, నిర్వహణ కోసం ఉపయోగించాలనే ఆలోచన ఉంది. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతుంది. కానీ అందరూ అంగీకరించరు. ఖైబర్ పఖ్తుంఖ్వాకు చెందిన సీనియర్ అధికారి డాక్టర్ అసల్ ఖాన్ మాట్లాడుతూ, కొన్ని చైనా కంపెనీలు గాడిదలను ఎగుమతి చేయడంలో ఆసక్తి చూపించాయి, కానీ మేము అలా జరగడానికి అనుమతించడం లేదని అన్నారు. చైనాలోని కొంతమంది కొనుగోలుదారులు గాడిద చర్మాల కోసం బలహీనమైన జంతువులను కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని గాడిద వ్యాపారులు చెబుతున్నారు. ఒక సందర్భంలో ఒక గ్రూప్ సభ్యులు.. 14 అనారోగ్యకరమైన గాడిదలకు 40వేల చొప్పున చెల్లించిందని తెలిపారు.

గాడిదల కొనుగోలుకు సంబంధించి కరాచీ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన సలీం రెజా కఠినమైన నియమాలు ఉండాలని అంటున్నారు. ”గాడిద మాంసం మాకు హరామ్” అని ఆయన అన్నారు. “పాకిస్తాన్‌లో గాడిదలను వధించకుండా, వాటి మాంసం చట్టవిరుద్ధంగా విక్రయించబడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని” డిమాండ్ చేశారు.