Dusting Challenge: యువత ప్రాణాలు తీస్తున్న కొత్త సోషల్ మీడియా ఛాలెంజ్.. అసలేంటీ డస్టింగ్ ఛాలెంజ్, ఎందుకు ప్రాణాంతకం, ఎలా చనిపోతారు?
డస్టింగ్ ఛాలెంజ్ లో పాల్గొన్న రూర్కీ కార్డియాక్ అరెస్ట్ కు గురైంది. ఆ తర్వాత ప్రాణాలే కోల్పోయింది.

Dusting Challenge: సోషల్ మీడియా పుణ్యమా అని కొందరు ఓవర్ నైట్ లో సెలబ్రిటీలు అయిపోతున్నారు. రాత్రికి రాత్రి పాపులారిటీ వచ్చి పడుతోంది. దీనికి కారణం సోషల్ మీడియానే. అందుకే, ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయిపోవాలని యువత ఆరాట పడుతోంది. ఈ క్రమంలో పిచ్చి పిచ్చి ఛాలెంజ్ లు పుట్టుకొస్తున్నాయి. ఆ ఛాలెంజ్ లు ఫినిష్ చేసి సోషల్ మీడియాలో తాము కూడా పాపులర్ అయిపోవాలని కొందరు ఆరాటపడుతున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అవటం ఏమో కానీ, ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు.
ఆ మధ్యన బ్లూవేల్, బ్లాకౌట్ వంటి ప్రమాదకర ఛాలెంజ్ లు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. తాజాగా కొత్త ఛాలెంజ్ వచ్చింది. అది యువత ప్రాణాలు తీస్తోంది. దాని పేరే ‘డస్టింగ్’. అమెరికాలోని ఆరిజోనా టెంపె ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల రెన్నా ఓ రూర్కీ అనే అమ్మాయి ఈ ఛాలెంజ్ చేసి ప్రాణాలు కోల్పోయింది. డస్టింగ్ ఛాలెంజ్ లో పాల్గొన్న రూర్కీ కార్డియాక్ అరెస్ట్ కు గురైంది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అలా వారం రోజులు గడిచాయి. ఈ వారం రోజులు ఆమె స్పృహలో లేదు. చివరికి డాక్టర్లు బ్రెయిన్ డెడ్ గా డిక్లేర్ చేశారు. ఆమె మరణానికి కారణం సడన్ స్నిఫింగ్ డెత్ సిండ్రోమ్ (SSDS) అని డాక్టర్లు చెప్పారు.
రూర్కీ మరణంతో ఆమె ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. రూర్కీ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బోరున విలపిస్తున్నారు. ‘మా అమ్మాయి ఎప్పుడూ నేను చాలా ఫేమస్ కాబోతున్నాను అని పదే పదే చెప్పేది. కానీ, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు’ అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు.
రూర్కీ ప్రాణం పోవడానికి కారణం డస్టింగ్ ఛాలెంజ్. అసలేంటీ డస్టింగ్ ఛాలెంజ్? ఇందులో ఏం చేయాలి? ఎందుకు ప్రాణాలు పోతున్నాయి? డస్టింగ్ చాలెంజ్ కు మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. క్రోమింగ్, హఫింగ్ అని కూడా పిలుస్తారు. ఇంట్లో వస్తువులు(కీబోర్డ్ వంటివి) శుభ్రం చేయడానికి వాడే క్లీనర్ల వాసన పీల్చుకోవడమే ఈ డస్టింగ్ ఛాలెంజ్. ఇలా చేస్తే కాసేపు గాల్లో తేలిన ఫీలింగ్ కలుగుతుందట. డస్టింగ్.. ఈ సోషల్ మీడియా ట్రెండ్ ఇప్పుడు వైరల్ ట్రెండ్‌గా మారింది.
ఇళ్లలో వాడే క్లీనర్స్ వాసన పీల్చడమే ఈ డస్టింగ్ ఛాలెంజ్. ఇలా చేస్తే వ్యూస్ బాగా వస్తాయని, ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోతామని యువత భావిస్తోంది. కానీ, పాపులర్ అవటం సంగతి అటుంచితే.. దీని వల్ల శరీరానికి చాలా నష్టం కూడా ఉంటుంది. కొన్నిసార్లు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అయినా సరే సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం రెన్నా వంటి వాళ్లు ఈ ఛాలెంజ్ స్వీకరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ట్రెండ్ అమెరికాలో బాగా ప్రాచుర్యంలో ఉంది.
”డస్టింగ్ ఛాలెంజ్ అంటే.. కీబోర్డ్ శుభ్రపరిచే స్ప్రేల కంప్రెస్డ్ గాలిని పీల్చడం. అలా చేస్తూ తమను తాము వీడియో తీసుకుంటారు. ఈ ఛాలెంజ్ టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో బాగా పాపులర్ అయ్యింది. కీబోర్డ్ శుభ్రపరిచే స్ప్రేల వంటి ఉత్పత్తుల నుండి ఏరోసోల్ ప్రొపెల్లెంట్‌లను పీల్చుకుంటున్నట్లు తమను తాము వీడియో తీసుకుంటారు. అలా ఆన్‌లైన్‌లో వ్యూస్ పొందే ప్రయత్నం చేస్తారు. అయితే, ఇలా చేయడం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలతో కూడి ఉంటుంది. అత్యంత తక్షణ ప్రమాదం సడన్ స్నిఫింగ్ డెత్ సిండ్రోమ్. అలా పీల్చిన తర్వాత గుండె లయలో మార్పులు వస్తాయి. కాసేపటికే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. రెన్నా విషయంలో కూడా ఇదే జరిగింది” అని నిపుణులు తెలిపారు.
కీబోర్డ్ క్లీనింగ్ స్ప్రేల నుండి కంప్రెస్డ్ గాలిని పీల్చడం ద్వారా ఆరోగ్యానికి గణనీయమైన ప్రమాదాలను కలిగిస్తుంది. శరీరం, మనసు తక్షణ దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలకు దారి తీస్తుంది.
డస్టింగ్ ఛాలెంజ్ తో కలిగే ఆరోగ్య ప్రమాదాలు:
క్లీనింగ్ స్ప్రేల ఉత్పత్తుల్లోని రసాయనాలు తల తిరగడం, వికారం, అస్పష్టమైన మాటలు, మన్వయ లోపానికి కారణమవుతాయి.
యుఫోరియా: తీవ్రమైన ఆనందం లేదా అధికమైన తాత్కాలిక అనుభూతి.
తల తిరగడం: దిక్కుతోచని లేదా అసమతుల్యత భావన.
సమన్వయ లోపం
అస్పష్టమైన స్పీచ్: పదాలను స్పష్టంగా ఉచ్చరించడంలో ఇబ్బంది.
వికారం, వాంతులు: వాంతికి దారితీసే కడుపులో అసౌకర్యం.
తలలో నొప్పి లేదా అసౌకర్యం.
ఈ దుష్ప్రభావాలు సాధారణంగా స్వల్పకాలికంగా ఉన్నప్పటికీ, అవి తీవ్రంగా ఉంటాయి.
డస్టింగ్ ఛాలెంజ్ తో ముడిపడి ఉన్న అత్యంత భయంకరమైన ప్రమాదాలలో ఒకటి సడన్ స్నిఫింగ్ డెత్ సిండ్రోమ్ (SSDS). ఈ పరిస్థితి ఇన్ హలంట్లను ఒకసారి ఉపయోగించిన తర్వాత సంభవించవచ్చు.
కార్డియాక్ అరెస్ట్: క్రమరహిత లయల కారణంగా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది.
శ్వాసకోశ వైఫల్యం: సరిగ్గా శ్వాస తీసుకోలేకపోవడం, ఆక్సిజన్ కొరతకు దారితీస్తుంది.
ఎయిర్ డస్టర్లలోని రసాయనాలు ఊపిరితిత్తులు, శరీరంలోని ఆక్సిజన్‌ను స్థానభ్రంశం చేస్తాయి. ఇది అవయవ వైఫల్యానికి మరణానికి దారితీస్తుంది.
ఎక్కువ సేపు లేదా పదే పదే క్లీనింగ్ స్ప్రేలలోని వాసనను పీల్చడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, మెదడు దెబ్బతింటాయి. వినికిడి లోపం తలెత్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ వంటి తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. ఇంకా నెర్వస్ సిస్టమ్, కిడ్నీలు దెబ్బతింటాయి. కార్డియో వాస్కులర్ సమస్యలు వస్తాయి.