Pakistani Ranger Captured: సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొరబడ్డ పాకిస్తాన్ రేంజర్‌ను బీఎస్‌ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. భారత్-పాక్ సరిహద్దులోకి ఓ పాక్ రేంజర్ చొరబడ్డాడు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. వెంటనే గమనించిన జవాన్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో
పాక్ రేంజర్ భారత్ భూభాగంలోకి ప్రవేశించడం అనుమానాలకు తావిస్తోంది.
కాగా, ఇటీవల అనుకోకుండా భారత సరిహద్దు దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించిన బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ పూర్ణం కుమార్ షాను పాక్ ఆర్మీ నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 23న పంజాబ్ బోర్డర్ లో ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ విడుదలకు భారత సైనిక అధికారులు చర్చలు జరుపుతున్నప్పటికీ ఫలితం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే ఆయనను విడుదల చేయడం కుదరదని పాక్ ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో పాక్ రేంజర్ భారత భద్రతా దళాలకు చిక్కడం ఆసక్తికరంగా మారింది.
Also Read: సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్.. యుద్ధ భయంతో వణికిపోతున్న పాకిస్తాన్.. పీవోకేలో ప్రజలకు కీలక ఆదేశాలు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు దేశాల సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందంటున్న భారత్.. ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించింది. పాక్ ను అష్టదిగ్బంధనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు పాక్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఎల్ ఓసీ వెంబడి భారత్ ఆర్మీ స్థావరాలు లక్ష్యంగా పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. పాక్ కాల్పులను భారత ఆర్మీ ధీటుగా తిప్పికొడుతోంది.