సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్.. యుద్ధ భయంతో వణికిపోతున్న పాకిస్తాన్.. పీవోకేలో ప్రజలకు కీలక ఆదేశాలు
పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తున్నాయి.

India Pakistan War
India – Pakistan War: పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తున్నాయి. దీంతో నియంత్రణ రేఖ వెంబడి టెన్షన్ వాతావరణం నెలకొంది. యుద్ధ వాతావరణంతో ఇరువైపులా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భయం గుప్పిట కశ్మీరీలు కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనే భయంతో ఇరువైపులా బంకర్లు సిద్ధం చేసుకుంటున్నారు. అటు అవసరమైన సామాగ్రిని ముందుగానే అందుబాటులో ఉంచుకుంటున్నారు. పీవోకేలో ప్రజలకు పాక్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలలకు సరిపడా ఆహార నిల్వలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
Also Read: Baba Vanga Prediction: ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుందా? వంగ బాబా జోస్యం ఏం చెబుతోంది..
ప్రస్తుతం యుద్ధం వాతావరణంతో ప్రజలు తమ ఇండ్లలో బంకర్లు నిర్మించుకుంటున్నారు. కాల్పులు జరిగినప్పుడు బంకర్లలో తలదాచుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతోపాటు పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి భారీగా బలగాలను మోహరిస్తుంది. మరోవైపు పాక్ సైనికుల కాల్పులకు ధీటుగా భారత్ సైన్యం ప్రతిఘటిస్తుంది. ఫలితంగా రెండువైపులా కాల్పులు జరుగుతుండటంతో స్థానికులు భయం గుప్పిట బతుకుతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ లో కొండలపై ఉన్న చకోతి గ్రామ ప్రజలు తమకు ఇళ్లకు సమీపంలో ఉన్న కొండవానులో బలమైన ఆశ్రయాలను సిద్ధం చేసుకున్నారు. కాల్పులు జరిగినా బంకర్లలోకి వెళ్లి తలదాచుకుంటారు. భారత సైనిక చర్య జరిగితే నియంత్రణ రేఖ వెంబడి పెద్దెత్తున ప్రజలు వలస వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పాక్ అధికారులు.. కనీసం ఐదు వందల కుటుంబాలకు టెంట్లు, వస్తు సామాగ్రి, వంట పరికరాలతో కూడిన సహాయ శిబిరాలను సిద్ధం చేస్తున్నారు.
ఇండియన్ ఆర్మీ ఎప్పుడైనా విరుచుకుపడొచ్చని భావిస్తున్న పాకిస్థాన్ పీవోకేను దాదాపు ఖాళీ చేయిస్తుంది. దాదాపు 15లక్షల మంది ప్రజలు ఎల్వోసీని వీడినట్లు తెలుస్తోంది. మరికొంత మంది ఇప్పటికే నిర్మించిన బంకర్లలో తలదాచుకుంటున్నట్లు సమాచారం. పీవోకేలో వెయ్యికిపైగా మదరసా పాఠశాలలు పాకిస్థాన్ అధికారులు మూసివేయించారు. పదిరోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ముజఫరాబాద్ లో కొంతమందికి ఒక వేళ యుద్ధ పరిస్థితుల్లో గాయాలైతే ఏం చేయాలి.. ఎలాంటి చికిత్స అందించాలో నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. గాయాలైన వారికి ప్రథమ చికిత్స ఎలా చేయాలి.. స్ట్రెచ్చర్ పై ఎలా తీసుకెళ్లాలి.. కాల్పుల నుంచి ఎలా తప్పించుకోవాలనే అంశాలపై పీవోకేలోని స్థానికులకు పాక్ ఆర్మీ సూచనలు చేసినట్లు కొందరు స్థానికులు చెప్పారు. దీంతో యుద్ధం అనివార్యమని పాకిస్థాన్ భయపడుతున్నట్లు స్పష్టమవుతోంది.