Pakisthan Army Chief Bajwa
Pakisthan Army Chief Bajwa : పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా ఈ నెల 29న పదవీ విరమణ చేయాల్సి వేళ ఆయన సంపద గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే మరోవైపు గత ఆరేళ్లలో బజ్వా కుటుంబ సభ్యులకు సంబంధించిన సంపద విపరీతంగా పెరిగిందని ఓ నివేదిక ద్వారా తెలిసింది. బజ్వా కుటుంబ సభ్యుల సంపద ఒక్కసారిగా ఎలా పెరిగిందన్న విషయాలను “ఫ్యాక్ట్ ఫోకస్” వెబ్ సైట్ కు సమర్పించిన నివేదిక ద్వారా పాకిస్థాన్ జర్నలిస్టు అహ్మద్ నూరానీ బయటపెట్టారు.
ఒక్క పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మాత్రమే కాదు.. ఆయనలా అవినీతికి పాల్పడుతున్న అధికారులు, పాలకులు పాక్‌లో ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు బయటపడింది బజ్వా పేరు మాత్రమే. కానీ.. బయటకు రాని వాళ్ల పేర్లు ఎన్నో ఉన్నాయనే చర్చ జరుగుతోంది. విదేశాల నుంచి అప్పుల రూపంలో వచ్చిన నిధులను.. పాక్ అధికారులు, పాలకులు పక్కదారి పట్టించినట్లు.. ఇప్పటికే చాలా సార్లు బయటపడింది.
దేశాభివృద్ధి పట్టదు.. అప్పులు తీర్చడం గురించి అస్సలు ఆలోచించరు. కానీ.. ఆస్తులు కూడబెట్టుకోవడంలో మాత్రం పాకిస్థాన్ నేతలు, అధికారులంతా ముందుంటారు. కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో జరుగుతున్నది ఇదే. దాయాది దేశంలోని పెద్ద మనుషుల అవినీతి చిట్టాను.. అంతర్జాతీయ మీడియా ఇప్పటికే ఎన్నోసార్లు బయటపెట్టింది. తాజాగా.. పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా ఎపిసోడ్‌తో.. మరోసారి పాకిస్థాన్‌లో ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయో.. ఈ ప్రపంచానికి మరోసారి అర్థమైంది. ఒక్క బజ్వా మాత్రమే కాదు.. ఆ దేశంలోని నాయకులు, ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న వ్యక్తులంతా.. స్వార్థపూరితంగానే ఆలోచిస్తున్నారు. దేశం ఏమైపోయినా ఫరవాలేదు గానీ.. తాను, తన కుటుంబం మాత్రం రాయల్‌గా బతకాలని చూస్తున్నారు. ఇందుకోసం.. ప్రభుత్వంలో మంచి పదవిలో, హోదాలో ఉన్నప్పుడే.. అన్నీ చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. లేకపోతే.. ఆర్మీ చీఫ్ స్థానంలో ఉన్న బజ్వా.. ఆరేళ్లలోనే 12 వందల కోట్లకు పైగా పోగేశారంటే.. ఆయన అవినీతి ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అవినీతి అనేది.. ఏ దేశంలోనైనా సాధారణమే. కానీ.. దానికంటూ ఓ లిమిట్ ఉంటుంది. కానీ.. పాకిస్థాన్‌లో కరప్షన్‌కు హద్దులనేవే లేదన్నది.. స్పష్టంగా అర్థమవుతోంది. అవినీతి చేసే దమ్ము, దానిని.. కప్పిపుచ్చుకునే తెలివి ఉంటే చాలు.. ఎంతైనా చేసేయొచ్చు. ఎన్ని కోట్లయినా.. లీగల్‌గా నొక్కేయొచ్చనే విషయం తెలుస్తోంది. ఇందుకు.. చిన్న ఎగ్జాంపుల్ ఒకటుంది. ఈ ఏడాది జనవరిలో.. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకటించిన కరప్షన్ ఇండెక్స్‌లో.. పాకిస్థాన్ 140వ స్థానానికి చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. మొత్తం 180 దేశాల లిస్టులో.. పాకిస్థాన్ 16 స్థానాలు దిగజారింది. దాయాది దేశంలో రూల్ ఆఫ్ లా లేకపోవడం వల్లే.. అవినీతి విపరీతంగా పెరిగిపోవడానికి కారణమనే వాదన కూడా ఉంది.
పాకిస్థాన్‌లో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పడానికి.. స్విస్ బ్యాంకులో ఉన్న పాక్ ఖాతాలో చెబుతాయ్. గత ఫిబ్రవరిలో 14 వందల మందికి సంబంధించిన 6 వందల బ్యాంకు అకౌంట్‌ల వివరాలు బయటపడ్డాయ్. వాటిలో ఉన్న మొత్తం విలువ 100 బిలియన్ డాలర్లకు పైనే ఉందని సమాచారం. ఇంకా.. బయటపడని ఖాతాలు కూడా చాలానే ఉన్నాయ్. అధికారులు, పాలకులుగా చెలామణీ అవుతున్న పాక్ ప్రముఖులంతా.. స్విస్ బ్యాంకుల్లో వేల కోట్లు దాచిపెట్టారనే విషయం ఎప్పుడో బయటపడింది. వీరిలో.. పాకిస్థాన్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ అక్తర్ అబ్దుర్ రహమాన్ ఖాన్ సహా ఇతర జనరల్స్, కీలక నేతల పేర్లు ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లో రిజిస్టర్ అయిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ క్రెడిట్ సూయిస్ నుంచి.. కొన్ని నెలల క్రితమే.. ఈ వివరాలు బయటకు పొక్కాయి.
రష్యాకు వ్యతిరేకంగా.. అప్ఘానిస్థాన్‌లోని ముజాహిదీన్‌లు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్చిన నిధులు, ఇతర సాయాన్ని అందించడంలో ఐఎస్ఐ మాజీ చీఫ్ సహకరించినట్లు.. కథనాలు వచ్చాయి. ముజాహిదీన్‌ల కోసం సౌదీ అరేబియా, యూఎస్ నుంచి వచ్చిన నిధులు.. అమెరికన్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ స్విస్ బ్యాంక్ ఖాతాకు వెళ్లాయని.. అంతర్జాతీయ వార్తాపత్రిక తెలిపింది. ఈ ప్రక్రియలో చివరగా.. పాక్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ గ్రూప్.. ఐఎస్‌ఐకి నిధులు వెళ్లాయి. మరోవైపు, స్విట్జర్లాండ్‌లో పాకిస్థానీల సగటు గరిష్ఠ నిల్వ 4.42 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లని న్యూస్ ఇంటర్నేషనల్ పత్రిక కథనం తెలిపింది. రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్న వారు, ప్రభుత్వపరమైన పదవుల్లో కొనసాగుతున్న వాళ్లు.. పాకిస్థాన్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ వివరాలేమీ తెలియజేయలేదు. ఇలా.. ఎవరికి వారు.. తమకు నచ్చినంత దోచేస్తూ.. స్విస్ బ్యాంకుల్లో దాచేస్తూ.. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. దీనిని బట్టే.. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు పాక్ ప్రభుత్వం ఎంతలా ఆలోచిస్తుందో.. అర్థం చేసుకోవచ్చు.