Sudan: సూడాన్ లో హృయదవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా అక్కడి ప్రజల బాధలు వర్ణనాతీతం. జనం ఆకలితో, దాహంతో అలమటిస్తున్నారు. తినడానికి తిండి లేకపోవడతో ఆకలి తట్టుకోలేక బొగ్గు, ఆకులు తింటున్నారు. అలా ఆకలి తీర్చుకుని ప్రాణాలతో ఉండేందుకు పోరాటం చేస్తున్నారు. సూడాన్ లో ప్రజల దుస్థితి గురించి ఓ స్వచ్ఛంద సంస్థ చెప్పిన విషయాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
ఎల్ ఫాషర్ సిటీకి సమీపంలోని క్యాంపుపై దాడి జరిగింది. అక్కడి నుంచి పారిపోయిన సూడానీలు కొందరు ఆకలితో అలమటిస్తున్నారు. తినేందుకు ఆహారం లేక బొగ్గు, ఆకులు తిని బతుకుతున్నారు. క్యాంపుపై దాడి తర్వాత ప్రజలు తవిలా పట్టణానికి వెళ్లేందుకు పయనం అయ్యారు. వారంతా ఎల్ ఫాషర్ సిటీకి వస్తున్నారని, కానీ దారిలోనే చనిపోతున్నారని ఆ సంస్థ వెల్లడించింది. మండు టెండల్లోనే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్రయత్నం చేశారని, తాగేందుకు నీళ్లు కూడా దొరక్క దాహంతో చనిపోతున్నారని వివరించారు.
ఎల్ ఫాషర్.. సూడాన్ పశ్చిమ ప్రాంతం డార్ఫర్‌లో ఉండే చివరి నగరం. ఇప్పుడీ ప్రాంతం ఆర్మీ, దాని మిత్రపక్షాల స్వాధీనంలో ఉంది. ఏప్రిల్ లో పారా మిలటరీకి చెందిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, జమ్‌జమ్ క్యాంపు మీద దాడి చేశాయి. దీంతో తాత్కాలికంగా నిర్మించుకున్న ఇళ్లను వదిలి వేల మంది పారిపోయారు. డార్ఫర్‌లో జరిగిన ఘర్షణల నుంచి తప్పించుకున్న జమ్‌జమ్ వాసులు 20ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు.
Also Read: బాధితుల ప్యాంట్లు విప్పించి చెక్ చేసిన ఉగ్రవాదులు.. ఎందుకంటే?
ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ రెండేళ్లుగా సూడాన్ సైన్యంతో పోరాడుతోంది. ఈ యుద్ధంలో లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. కోటి 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అటు కరవు పీడిత సూడాన్‌కు అందిస్తున్న ఆహార సాయాన్ని ఐక్యరాజ్య సమితి తగ్గించింది. నిధుల కొరతే ఇందుకు కారణం.
యుద్ధ సమయంలో డార్ఫర్‌లోని అరబ్ యేతరులను ఆర్ఎస్ఎఫ్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో సామూహిక జాతి హననానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయి. సూడాన్‌లో పరిస్థితులపై యూఎన్ వో మానవహక్కుల అధిపతి వోకర్ తుర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇళ్లను, సహాయ కేంద్రాలను తగలబెట్టడం ద్వారా ఒక పద్ధతి ప్రకారం విధ్వంసం జరుగుతోంది. జమ్‌జమ్ క్యాంపు నుంచి తప్పించుకున్న ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. తమ ఇళ్లను వదిలి పారిపోయి వస్తున్న వారికి ఆశ్రయం కల్పించలేక తవిలా సిటీ ఇబ్బంది పడుతోంది. అక్కడ ఆహారం, నీరు చాలా తక్కువ. ఆ చిన్న పట్టణం లక్ష 50వేల మందికి ఆశ్రయం ఇస్తోంది.
గత రెండు వారాలలో సూడాన్‌లోని ఉత్తర డార్ఫర్ ప్రాంతంలో జరిగిన వరుస దాడుల్లో 480 మందికి పైగా పౌరులు మరణించారు. ఉత్తర డార్ఫర్ అంతటా సాయుధ మిలీషియాలు, సైనిక ప్రభుత్వ దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు పెరిగాయి. ఇది కాకుండా RSF నిర్బంధ కేంద్రాలలో ఆహారం, నీరు, వైద్య సంరక్షణ కొరత కారణంగా లేదా హింస నుండి పారిపోవడానికి కఠినమైన పరిస్థితుల్లో రోజుల తరబడి నడుస్తున్నప్పుడు డజన్ల కొద్దీ ప్రజలు మరణించినట్లు నివేదించబడింది. ప్రపంచంలో కరవు ప్రాంతంగా అధికారికంగా నిర్ధారించబడిన ఏకైక దేశం సూడాన్.
ఉత్తర డార్ఫర్‌లో ఇటీవల చెలరేగిన హింసాకాండ లక్షలాది మంది పౌరులు పారిపోవడానికి దారితీసింది. అలా పారిపోయిన వారిలో చాలామంది తవిలా, దార్ ఎస్ సలాం, ఇతర ప్రాంతాలలో తలదాచుకుంటున్నారు. అక్కడ తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు దొరక్క దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సూడాన్‌లోని నార్త్ డార్ఫర్‌లోని ఎల్ ఫాషర్ చుట్టుపక్కల ప్రాంతాలలో మానవ హక్కుల పరిస్థితి దిగజారుతుండటంపై UN మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here