Pahalgam attack: బాధితుల ప్యాంట్లు విప్పించి చెక్‌ చేసిన ఉగ్రవాదులు.. ఎందుకంటే?

ఉగ్రవాదుల చర్యలతో మృతుల బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Pahalgam attack: బాధితుల ప్యాంట్లు విప్పించి చెక్‌ చేసిన ఉగ్రవాదులు.. ఎందుకంటే?

Pahalgam

Updated On : April 26, 2025 / 5:42 PM IST

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇందులో భాగంగా కీలక వివరాలు తెలిశాయి. బాధితుల్లో దాదాపు 20 మంది పురుషుల్లో కొందరి ప్యాంటును ఉగ్రవాదులు కిందికి లాగారని, కొందరు పురుషుల ప్యాంటు జిప్‌లను విప్పారని అధికారులకు తెలిసింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన వివరాల ప్రకారం.. తాము చంపాలనుకుంటున్న పురుషులు ఏ మతానికి చెందిన వారో తెలుసుకోవడానికి ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారు. ముస్లింలు సున్తీ చేయించుకుంటారు కాబట్టి పురుషుల ప్యాంటు విప్పి చూస్తే ఎవరు ఇస్లాం మతానికి చెందినవారు కాదో తెలిసిపోతుంది.

దీంతో, వారి మతాన్ని నిర్ధారించుకుని ఇతర మతాల వారిని చంపేయొచ్చని ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్ పోలీసులు, జేకే పరిపాలనా విభాగ అధికారులు ఘటనాస్థలికి వచ్చి బాధితులను చూశారు. ఆ సమయంలో 26 మంది బాధితులలో 20 మంది లోదుస్తులను ఉగ్రవాదులు బలవంతంగా తొలగించారు. బాధితుల లోదుస్తులు/ప్రైవేట్ భాగాలు బయటపడి ఉండడాన్ని వారు చూశారు.

ఉగ్రవాదుల చర్యలతో మృతుల బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ షాక్‌లో అసలు మృతదేహాలపై దుస్తులు ఎలా ఉన్నాయన్న పరిస్థితిని వారు గమనించే స్థితిలో లేరు. అధికారులు వచ్చి మృతదేహాలపై తెల్లటిబట్టలను కప్పారు.

బాధిత పురుషులను ఉగ్రవాదులు క్రూరంగా పరీక్షించారని అధికారులు గుర్తించారు. మనుషుల మతాన్ని నిర్ధారించుకోవడానికి ఉగ్రవాదులు పురాతన పద్ధతిని పాటించారని గుర్తించారు.

ఉగ్రవాదులు మొదట ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు వంటి గుర్తింపు కార్డులను చూపాలని బాధితులను డిమాండ్ చేశారు. అలాగే, ముస్లింలు చేసే ప్రార్థ కల్మాను పఠించాలని చెప్పారు. అక్కడితో ఆగకుండా సున్తీని చెక్‌ చేయడానికి లోదుస్తులను తీసివేయించారు.

ఈ మూడు పరీక్షల ద్వారా ఆయా బాధితులను హిందువులుగా ఉగ్రవాదులు నిర్ధారించుకున్న తర్వాత చాలా దగ్గరి నుంచి వారిని కాల్చేశారు. ఈ దాడిలో మరణించిన 26 మందిలో 25 మంది హిందువులు.