ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రస్తుతం ఈ వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వైరస్ పుణ్యమా అని.. కడుపున పుట్టిన పిల్లలతో పాటు పెంపుడు జంతువులకు సమానమైన ఆదరణ ఇచ్చే వాళ్లంతా ఉన్నట్టుండి రోడ్లపైకి నెట్టేస్తున్నారు. ఇన్నాళ్లుగా సకల సౌఖ్యాలు అనుభవించిన కుక్కలు, పిల్లులు రోడ్లపై అనాథలుగా పడి ఉన్నాయి. కొన్ని ప్రాణాలను కోల్పోయినా పట్టించుకునే నాథుడు లేడు.
చైనాలో కరోనా వైరస్ జంతువుల నుంచి వ్యాపిస్తుందని నమ్మిన వారు ప్రేమతో పెంచుకున్న పెంపుడు జంతువులను కూడా ఆలోచించకుండా వదిలించుకుంటున్నారు. వ్యాధి సోకిన వారి దగ్గరకు వెళ్లొచ్చిన జంతువులను క్యారంటైన్‌లో ఉంచాలని మాత్రమే వైద్యులు సూచించారు. ఇది స్థానిక మీడియాలో మరో విధంగా ప్రచారం కావడంతో.. పెంపుడు జంతువుల వల్ల ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని చైనీయులు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నో రోజులుగా తమ మధ్య ప్రేమగా పెరిగిన కుక్కలను, పిల్లులను అపార్ట్‌మెంట్ల మీద నుంచి వాటిని అంటుకోకుండానే క్రిందకు తోసేస్తున్నారు. ఇలా మరణించిన పెంపుడు జీవాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిపై స్పందించిన ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవాలని.. మూగజీవాల ప్రాణాలు పోవడానికి కారణం కావద్దని సూచించింది.
పెంపుడు జంతువుల వల్ల కరోనా వైరస్ సోకిన సూచనలు లేవని.. అడవి జంతువుల వల్లే వస్తుందని కారణాలు తెలుసుకోకుండా.. మూగ జీవాల ప్రాణాలు తీయొద్దని జంతుప్రేమికులు వాపోతున్నారు.