ప్లాస్మా థెరపీతో ప్రాణానికే ప్రమాదం… బాంబు పేల్చిన కేంద్రం

మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్. కంటికి కనిపించని ఈ శత్రువు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కాగా, ప్రస్తుతానికి కరోనా మహమ్మారికి ముందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. సామాజిక దూరమే శ్రీరామ రక్ష. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో కరోనా వ్యాక్సీన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల హ్యూమన్ ట్రయల్స్ కూడా మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకటి ప్లాస్మా థెరపీ.

కరోనా రోగుల్లో ఆశలు రేపిన ప్లాస్మా థెరపీ:
ఈ పదం అందరిలోనూ కొత్త ఆశలు చిగురింపజేసింది. ఇక భయం లేదు, కరోనా గండం నుంచి గట్టెక్కినట్టే అని అంతా ఆనందపడ్డారు. ఈ విధానంలో చికిత్స చేయడంతో రోగులు కోలుకుంటున్నారనే వార్త ఊరటనిచ్చింది. మన దేశంలో పలు చోట్ల ప్లాస్మా థెరపీ ద్వారా సత్ఫలితాలు కూడా వచ్చాయి. దీంతో అంతా ఆ ట్రీట్ మెంట్ పై గంపెడాశలు పెట్టుకున్న వేళ కేంద్రం బాంబు పేల్చింది. షాకింగ్ న్యూస్ వినిపించింది.

ప్లాస్మా థెరపీ చట్టబద్దం కాదు, ప్రాణానికే ప్రమాదం:
ప్లాస్మా థెరపీ కరోనాకు చికిత్స కాదని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు ప్లాస్మా థెరపీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పింది. ప్లాస్మా థెరపీ చట్టబద్ధం కాదు, పైగా ప్రాణాంతకం కూడా అని తేల్చింది. ప్లాస్మా థెరపీని సరిగా నిర్వహించని పక్షంలో రోగి ప్రాణాలకు ముప్పు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుతం ఇది పరిశోధన దశలోనే ఉందని, కరోనా చికిత్సలో ఈ విధానానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీ సహా ఏ థెరపీని ఆమోదించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మంగళవారం(ఏప్రిల్ 28,2020) తెలిపారు.

ప్లాస్మా థెరపీతో కరోనా తగ్గిపోతుందనడానికి ఆధారాలు లేవు:
‘‘ప్లాస్మా థెరపీతో కరోనా తగ్గిపోతుందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాన్ని ప్రయోగంగానే(ట్రయల్స్) భావించాలి తప్ప, ట్రీట్మెంట్ గా(చికిత్స) ఇంకా నిర్దారించలేదు. ప్లాస్మా థెరపీపై ఐసీఎంఆర్ సైంటిస్టులు జాతీయ స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే ప్లాస్మా పనితీరుపై సైంటిఫిక్ ప్రూఫ్ లభించే అవకాశముంది. సరైన విధానంలో, నిపుణుల పర్యవేక్షణ లేకుండా ప్లాస్మా థెరపీ చేస్తే రోగి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి ఈ థెరపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి” అని అగర్వాల్ హెచ్చరించారు.

ఐసీఎంఆర్‌ అనుమతి తర్వాత:
ప్లాస్మా థెరపీకి సంబంధించి 450 మందిపై ఐసీఎంఆర్‌ అధ్యయనం చేస్తోందని, ఇది పూర్తయ్యే వరకు, శాస్త్రీయ ఆధారం లభించేవరకు జాగ్రత్తగా ఉండాలని అగర్వాల్ చెప్పారు. ఐసీఎంఆర్‌ అనుమతితోనే పరిశోధనపరంగా ప్లాస్మా థెరపీని చేపట్టాలని వైద్యులకు సూచించారు. కాగా, దేశంలో కరోనా కేసుల రెట్టింపు రేటు ప్రస్తుతం 10.2 రోజులుగా ఉందని అగర్వాల్ చెప్పారు. గత 24 గంటల్లో కొత్తగా 1,543 కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 30,200కు చేరిందన్నారు. దేశంలో రికవరీ రేటు 23.3శాతంగా ఉందన్నారు.

మన దేశంలో కొంతకాలంగా ప్లాస్మా థెరపీ పాపులర్ అవుతూ వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి రక్తం సేకరించి, ప్లాస్మాను వేరు చేస్తారు. దాన్ని క్రిటికల్ కండిషన్ లోని కరోనా పేషెంట్లకు ఎక్కించడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టారు. ఒక దశలో ప్లాస్మా దానాలు చేయాలంటూ ప్రభుత్వాలు సైతం పిలుపునిచ్చాయి. సడెన్ గా, ప్లాస్మా థెరపీతో ప్రాణాపాయం తలెత్తొచ్చని కేంద్రం హెచ్చరించం సంచలనంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు