Gotabaya Rajapaksa
Sri Lanka crisis: శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు గొటబయ రాజపక్సే సిద్ధమైనట్లు తెలుస్తోంది. జులై 13న అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేస్తారని ప్రధాని రణిల్ విక్రమసింఘేకు గొటబయ తెలియజేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం తెలిపింది. గొటబాయ అధికారిక నివాసాన్ని శనివారం వేలాది మంది ఆందోళన కారులు ముట్టడించిన విషయం విధితమే. రెండు రోజులుగా వందలాది మంది ఆందోళనకారులు ఆ భవనంలోనే ఉంటున్నారు. గొటబాయ రాజపక్సే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు దేశవ్యాప్తంగా గొటబయ రాజీనామా చేయాలన్న నినాదాలు మారుమోగుతున్నాయి. దీంతో మరోమార్గం లేదని భావించిన గొటబయ.. బుధవారం రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. 13న రాజీనామా చేస్తానని ప్రధాని కార్యాలయానికి తెలిపిన రాజపక్సే.. తాను ఎక్కడ తలదాచుకున్నాడనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు.
Sri Lanka Crisis: గొటబయ నివాసంలో రహస్య బంకర్.. అందులో నుంచే పారిపోయాడా!
శ్రీలంకలో కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు దొరక్క అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ కోసం రెండుమూడు రోజులు క్యూలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ దేశ ప్రజలు రోడ్లపైకి వచ్చిన తమ నిరసనను తెలియజేస్తున్నారు. దేశంలో ఈ పరిస్థితులకు కారణం రాజపక్సే కుటుంబమేనని, వెంటనే గొటబయ రాజపక్సే రాజీనామా చేయాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం గొటబయ అధికారిక నివాసం ముట్టడికి యత్నించారు. భద్రతాసిబ్బందిని దాటుకొని లోపలికి వెళ్లారు. పరిస్థితి చేయిదాటడంతో గొటబయ రాజపక్సే అక్కడి నుంచి పరారయ్యారు. తాజాగా ఆయన అధ్యక్ష రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. అధ్యక్ష నివాసంపై దాడి జరిగిన కొద్ది గంటలకే ప్రధాని విక్రమ సింఘే కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుకు చర్యలు వేగంవంతం అయ్యాయి.
అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలు సోమవారం చర్చలు ప్రారంభించనున్నాయి. రాజపక్సే అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు, ప్రధాని ఇద్దరూ రాజీనామా చేస్తే పార్లమెంటు స్పీకర్ గరిష్టంగా 30రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇంతలో, పార్లమెంటు తన సభ్యులలో ఒకరి నుండి 30రోజులలోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. అతను ప్రస్తుత పదవీకాలానికి మిగిలిన రెండేళ్ల పాటు పదవిని నిర్వహిస్తాడు.