నేపాల్ కొత్త పీఎం సుశీల కర్కి సంచలనం.. అల్లర్లు చేసిన వాళ్ల మీద కేసులు
“నిరసనల పేరిట జరిగిన విధ్వంసాన్ని చూస్తే, అది పథకం ప్రకారమే అమలు చేసినట్లే కనిపిస్తోంది, కుట్రలు జరిగాయా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతోంది” అని అన్నారు.

Sushila Karki
Prime Minister Karki: నేపాల్ కొత్త ప్రధాని సుశీల కర్కి సంచలన కామెంట్స్ చేశారు. జెన్ జీ చేసిన నిరసనల వల్లే ఆమె నేపాల్ ప్రధాని అయిన విషయం తెలిసిందే. అయితే, ఆదివారం ఆమె మాట్లాడుతూ.. గత వారం జెన్ జీ నిరసన సమయంలో జరిగిన విధ్వంసాలు దేశంపై పాల్పడిన నేర చర్యలేనని అన్నారు.
నేర చర్యలపై దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాలని, బాధ్యులను శిక్షించాలని సుశీల కర్కి అన్నారు. దేశాన్ని సరైన దిశలో నడిపేందుకు సమష్టిగా ముందుకు వెళ్లడం అవసరమని ఆమె చెప్పారు. (Prime Minister Karki)
ఇప్పటికే సుశీల కర్కి తాత్కాలిక ప్రధానిగా నియమితులై పదవిని స్వీకరించారు. నిరసనల వల్ల నష్టపోయిన బాధితులకు సాయాన్ని ప్రకటించారు. ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వ రోడ్‌మ్యాప్‌లో భాగంగా హామీ ఇచ్చారు.
“27 గంటల్లోనే ఇంతటి మార్పు నేను ఎప్పుడూ చూడలేదు. ఈ వర్గం డిమాండ్లు నెరవేర్చడానికి మనమంతా సంకల్పంతో పనిచేయాలి. నేను ఇక్కడికి ఏదో కోరికతో రాలేదు. మీరు నన్ను ముందుకు రావాలని కోరిన తర్వాతే ఈ బాధ్యత స్వీకరించాను” అని అన్నారు.
“నిరసనల పేరిట జరిగిన విధ్వంసాన్ని చూస్తే, అది పథకం ప్రకారమే అమలు చేసినట్లే కనిపిస్తోంది, కుట్రలు జరిగాయా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతోంది” అని అన్నారు.
సింఘ దర్బార్, పార్లమెంట్ భవనం, సుప్రీంకోర్టు, వ్యాపార సముదాయాలు, ప్రైవేటు ఆస్తులపై జరిగిన విధ్వంసంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని కర్కి తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రతివారూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.