ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో మాస్కు దేనికోసం వాడతారని అడిగితే, కరోనా కట్టడి కోసం అని టక్కున చెబుతారు. కరోనా బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్కు ధరిస్తున్నాం. కరోనా వైరస్ నుంచి కాపాడటంలో మాస్కుది కీ రోల్. కానీ, మాస్కుని ప్రాణాలు తీసుకోవడానికి, ఆత్మహత్యకు కూడా వాడతారని తెలుసా. షాకింగ్ గా ఉంది కదూ. ఆ ఖైదీ అదే పని చేశాడు. మాస్కుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలోని కనెక్టికట్ లోని జైల్లో ఈ ఘటన జరిగింది.
జైల్లో ఖైదీలకు కరోనా సోకుండా అధికారులు మాస్కులు ఇచ్చారు. ఆ మాస్కుతో డేనియల్(32) అనే ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకుని చనిపోయాడు. దొంగతనం కేసులో డేనియల్ ఆగస్టు 5న అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతడిని జైలుకి తరలించారు. అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నాడు.
ఖైదీ మాస్కుతో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. తోటి ఖైదీలను, అధికారులను విస్మయానికి గురి చేసింది. దీనిపై విచారణ చేపట్టారు. ఖైదీ మృతిపై సమగ్ర దర్యాఫ్తు జరుగుతోందన్నారు. ఆత్మహత్యకు అతడు వాడిన క్లాత్ మెటీరియల్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
జైల్లో 9వేల మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 1300మందికిపైగా కరోనా బారిన పడ్డారు. 386 మంది సిబ్బంది సైతం కరోనా బారిన పడ్డారు. కరోనా బాధితుల్లో కొందరు చనిపోయారు కూడా. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కారణంగా అధికారులు ఖైదీలందరికి మాస్కులు ఇచ్చారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని రూల్ పెట్టారు. ఖైదీలు వారి సెల్ నుంచి బయటకు వస్తే కచ్చితంగా మాస్కులు ధరించాలి.