Putin : 111 సార్లు పొడిచి ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తికి పుతిన్ క్షమాభిక్ష.. యుక్రెయిన్ యుద్ధభూమిలో రక్తంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారట!

ప్రియురాలిపై అత్యాచారం చేసి..అత్యంత పాశవికంగా 111సార్లు కత్తితో పొడిచి చంపిన యువకుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టారు.

Russia President Vladimir Putin

Russia President Vladimir Putin : ప్రియురాలిపై అత్యాచారం చేసి.. అత్యంత పాశవికంగా 111 సార్లు కత్తితో పొడిచి చంపిన యువకుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టారు. యుక్రెయన్ పై రెండేళ్ల నుంచి యుద్ధాన్ని కొనసాగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను చవి చూస్తున్న పుతిన్.. ప్రియురాలిని అత్యంత దారుణంగా చంపిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టి రష్యన్ ప్రజల నుంచి వ్యతిరేకతను కూడా మూటకట్టుకున్నారు. తన బిడ్డను అత్యంత దారుణంగా చంపిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడంపై మృతురాలి తల్లి తీవ్రంగా మండిపడుతున్నారు.

వ్లాడిస్లావ్‌ కన్యస్‌ అనే యువకుడు వెరా ఫెఖ్‌ టెలేవా అనే యువతితో డేటింగ్ చేశాడు. కానీ అతనితో ప్రేమను కొనసాగించలేనని, విడిపోతానని చెప్పింది వెరా. అది అతను భరించలేకపోయాడు. సైబీరియన్ నగరమై కెమెరోవోకు తీసుకెళ్లి ఆమె 111 సార్లు పొడిచాడు. ఆమె గాయాలతో విలవిల్లాడిపోతుంటే ఆమెపై అత్యాచారం చేశాడు. అలా మూడున్నర గంటలపాటు అత్యంత పాశవికంగా హింసించాడు. ఆ తర్వాత ఇనుప ఫ్లెక్స్‌తో ఆమె గొంతుకోసి చంపేశాడు. చిత్రహింసలకు గురిచేస్తుండగా ఆమె పెద్ద పెద్దగా అరిచింది. ఆమె అరుపులు విన్న స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. కానీ పోలీసులు ఎంతకీ స్పందించలేదు.

Also Read: కనురెప్పతో సహా కన్ను మార్పిడి చేసిన డాక్టర్లు .. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన సర్జరీ

ఈ క్రమంలో అతని చేతిలో చిత్రహింసలకు గురైన ఆమె చనిపోయింది. 2020లో సైబీరియాలో జరిగిన ఈ దారుణంపై మృతురాలి తల్లి ఒక్సానా ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వ్లాడిస్లావ్ ను అరెస్ట్ చేశారు. కోర్టులో అతనికి 17 ఏళ్లు జైలుశిక్షను విధించింది. కానీ అతను మాత్రం కనీసం ఒక్క సంవత్సరం కూడా శిక్ష అనుభవించకుండానే పుతిన్ పెట్టిన క్షమాభిక్షతో బయటకు వస్తున్న పరిస్థితిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. క్షమాభిక్షతో బయటపడ్డ నేరస్తుడు ఇప్పుడు యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటానని  చెప్పడంతో పుతిన్ అతడ్ని క్షమించి.. యుద్ధానికి పంపించారు. దీంట్లో భాగంగా అతనిని యుక్రెయిన్ సరిహద్దులో ఉన్న దక్షిణ రష్యాలోని రోస్టోవ్‌కు బదిలీ చేశారు జైలు అధికారులు. దీనికి సంబంధించి రష్యన్ ప్రాసిక్యూషన్ జనరల్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల అయ్యింది.

ఒక యువతిని అత్యంత దారుణంగా చంపిన క్రూరుడికి క్షమాభిక్ష పెట్టడం, జైలు నుంచి విడుదలయ్యాడనే విషయం తెలిసిన మృతురాలు తల్లి ఒక్సానా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘‘ఈ విషయం తెలియగానే నేను షాక్‌కి గురయ్యా. నా కూతురు అక్కడ సమాధిలో కుళ్లిపోతుంటే.. హంతకుడేమో యుద్ధం పేరుతో బయట హాయిగా తిరుగుతున్నాడు’’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు తనకిప్పుడు జీవితం మీదే నమ్మకం పోయిందని, ఏం చేయాలో అర్థం కావడం లేదు. క్రూరమైన వ్యక్తి చేతికి ఆయుధం ఎలా ఇస్తారు? ప్రతీకారంతో అతడు మమ్మల్ని  చంపినా చంపొచ్చు. అసలు అతడు మనిషే కాదు అంటూ ఆమె మండిపడ్డారు. కన్యస్‌ కు క్షమాభిక్ష పెట్టారనే విషయాన్ని జైలు అధికారులు దృవీకరించారని మహిళా హక్కుల కార్యకర్త అలియానా పోపోవా బుధవారం తెలిపారు.

Also Read: జుట్టు పొట్టిగా ఉన్న మహిళలపై దాడి .. యువకుడు చెప్పే సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే..

జైలు నుంచి ఇలా హంతకులకు క్షమాభిక్ష పెట్టి యుద్ధానికి పంపడాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సమర్థించారు. యుక్రెయిన్‌తో పోరాడటానికి పంపిన రష్యన్ ఖైదీలు.. తాము చేసిన నేరాలకు ‘రక్తంతో’ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని.. ఘోరమైన నేరాలు చేసి దోషులుగా నిర్ధారింపబడినవారు యుద్ధభూమిలో బుల్లెట్లు పేలుస్తూ.. ఫిరంగి కాల్పులతో తమ నేరాలకు రక్తంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు అంటూ మీడియా సమావేశంలో తెలిపారు.

కాగా.. స్వతంత్ర ఖైదీల హక్కుల సంఘం అధిపతి ఓల్గా రొమానోవా అంచనాల ప్రకారం యుక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధంలో రష్యా దాదాపు 1,00,000 మందిని జైళ్ల నుండి నియమించుకుంది. జైలు నుంచి విడుదలైన ఖైదీలు తమ సైనిక సేవను ముగించిన తరువాత హత్యతో సహా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని రష్యన్ మీడియా సంస్థలు చెబుతున్నాయి.