Prince Harry-Meghan Markle..Queen Elizabeth “The New Royals book
Prince Harry-Meghan Markle..Queen Elizabeth “The New Royals book : ముద్దుల మనవడు రాజరికం విధులను వదులుకుంటున్నట్టు ప్రకటించినప్పుడు రాణి ఎలిజబెత్ స్పందనేంటి? 2020లో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు బకింగ్‌హామ్ ప్యాలెస్ విడిచి వెళ్లిన తర్వాత అందరికీ కలిగిన సందేహమిది. రాజభవనంలో తాము ఎదుర్కొన్న అవమానాలపై హ్యారీ, మార్కెల్‌లు బహిరంగంగా విమర్శలు చేసినా..రాజకుటుంబం మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. అసలు మనవడి నిర్ణయం గురించి రాణి ఏమనుకున్నారన్నది ఎవరికీ తెలియలేదు. ఆమె మరణానంతరం ఈ విషయం బయటికి వచ్చింది. రాజకుటుంబం వారసుడిగా హ్యారీ ఆ నిర్ణయానికి ఎలా వచ్చారన్నది రాణి అర్ధం చేసుకోలేకపోయారని..‘ద న్యూ రాయల్స్’ అనే పుస్తకం వెల్లడించింది.
The Hidden Power Behind the Crown : ప్రిన్స్ హ్యారీని మేఘన్ మార్కెల్ బెదిరించి వివాహం చేసుకున్నారంటున్న రాయల్ ఫ్యామిలీ మీడియా
బ్రిటన్ రాజకుటుంబం ఉలికిపాటుకు గురయిన సందర్భాల్లో ప్రముఖంగా చెప్పుకునేది 1990ల్లో ప్రిన్సెస్ డయానా, చార్లెస్ విడాకులు, 2020లో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు బకింగ్‌హామ్ ప్యాలెస్ విడిచి వెళ్లిపోవడం. రాజకుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాలు, విభేదాలు వంటివాటిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది ఈ రెండు సందర్భాల్లోనే. 1997లో డయానా మరణించిన తర్వాత కూడా ఇప్పటికీ ఆమెకు సంబంధించి ఏదో ఓ విషయం బయటకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు హ్యారీ, మేఘన్ మార్కెల్ గురించి కూడా డయానా తరహాలోనే విస్తృత చర్చ సాగుతుంటుంది. దీనికి కారణం…గతంలో రాణి కుటుంబంలో ఎవరూ చేయనట్టుగా ప్రిన్స్ హ్యారీ రాయల్ డ్యూటీస్‌ను తిరస్కరించి మరీ భార్యతో కలిసి రాజభవనం నుంచి వెళ్లిపోవడం. హ్యారీ, మేఘన్ బ్రిటన్ నుంచి వెళ్లిపోయి అమెరికాలో స్థిరపడడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఓఫ్రా విన్‌ఫ్రేకు వారిచ్చిన ఇంటర్వ్యూ పెను ప్రకంపనలకు కారణమైంది.
భార్య కోసం..ప్రిన్స్ హ్యారీ సంచలన నిర్ణయం
రాజకుటుంబంలో వర్ణ వివక్ష ఉందని, తానెన్నో అవమానాలు ఎదుర్కొన్నానని మేఘన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హ్యారీ వాటన్నింటినీ ధృవీకరించారు. అయితే ఈ ఇంటర్వ్యూలో హ్యారీ దంపతులు చెప్పిన విషయాలపై ఓ ఖండన ఇచ్చి రాజకుటుంబం సరిపెట్టింది. అప్పుడు కానీ ఆ తర్వాత కానీ హ్యారీ రాయల్ డ్యూటీస్ తిరస్కరించడంపై ఎవరూ స్పందించలేదు. రాజుగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో చార్లెస్…అమెరికాలో స్థిరపడ్డ తన కుమారుడు హ్యారీ సంతోషంగా ఉండాలని కోరుకుంటానని మాత్రమే మాట్లాడారు. అయితే అసలు హ్యారీ ప్యాలెస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో నాయనమ్మ క్వీన్ ఎలిజబెత్ ఎలా స్పందించారన్నది ఎవరికీ తెలియదు. ద న్యూ రాయల్స్ అనే పుస్తకం ఈ విషయం వెల్లడించింది. రాణి మరణం తర్వాత విడుదలైన ఈ పుస్తకం..హ్యారీ విషయంలో నాయనమ్మ పడ్డ వేదనను తెలియజేసింది.
ప్రిన్స్ హ్యారీ, ఎలిజబెత్ మధ్య నాయనమ్మ, మనవడిగా మంచి సంబంధాలున్నాయి. ఎలిజబెత్ హ్యారీని ముద్దుల మనవడిగా చూస్తారు. అలాంటి హ్యారీ రాజకుటుంబం వీడతానని అన్నప్పుడు రాణి ఆశ్చర్యపోయారు. 25 ఏళ్ల వయసులో బ్రిటన్ రాణిగా బాధ్యతలు చేపట్టిన ఎలిజబెత్..తన జీవితం మొత్తాన్ని రాయల్ డ్యూటీస్ నిర్వహించడానికే కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అదో గౌరవంగా భావించారు. జీవితాంతం అలాగే ఉన్నారు. కానీ రాజకుటుంబ వారసుడైన హ్యారీ రాయల్ డ్యూటీస్‌ను తిరస్కరించడాన్ని రాణి ఎలిజెబత్ అసలు అర్థం చేసుకోలేకపోయారు. ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి ఆమెంతో కష్టపడ్డారు. ఈ విషయాలన్నీ ద న్యూ రాయల్స్ బుక్‌లో వివరించారు రచయిత కేటీ నిఖోల్. హ్యారీకి ఎలిజబెత్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని, అమెరికా వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగిందని తెలిపారు. మేఘన్ మార్కెల్ కూడా ఎప్పుడూ రాణి ఎలిజబెత్‌పై ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. ఆమె తమనెంతో ప్రేమగా చూసుకున్నారని మేఘన్ చెప్పేవారు.
అయితే రాణి మరణించిన వెంటనే మేఘన్‌పై వ్యతిరేక ప్రచారం సాగింది. విడుదలకు సిద్ధంగా ఉన్న కర్టియర్స్: ద హిడెన్ పవర్ బిహైండ్ ది క్రౌన్ అనే పుస్తకం మేఘన్ మార్కెల్ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టినట్టు వార్తలొచ్చాయి. ప్రిన్స్ హ్యారీని బెదిరించి మేఘన్ వివాహం చేసుకున్నారని…తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించకపోతే బ్రేకప్ చెప్తానని మేఘన్ బెదిరించేవారని ఆ పుస్తకంలో ఉందని బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది. ఏం చేయలేని నిస్సహాయస్థితిలోనే హ్యారీ..మేఘన్‌ను తన గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రపంచానికి పరిచయం చేశారని, అంతేకాకుండా హ్యారీతో వివాహం రోజు మేఘన్ వేసుకున్న తెల్లడ్రెస్ చూసి రాణి ఎలిజబెత్ ఆశ్చర్యపోయారని, అప్పటికే ఓ వివాహమై విడాకులు కూడా తీసుకున్న మేఘన్…స్వచ్ఛతకు నిదర్శనమైన తెల్లరంగు డ్రెస్ వేసుకోవడం ఎలిజబెత్‌కు నచ్చలేదని ఆ పుస్తకంలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అంతేకాకుండా రాజకుటుంబంలో ఇమిడిపోయేందుకు మేఘన్ ఎప్పుడూ ప్రయత్నించలేదని, ప్యాలెస్ నుంచి వెళ్లిపోవాలన్న తరహాలోనే ఆమె ప్రవర్తన ఉండేదని కూడా పుస్తకం రాసిన బ్రిటన్ జర్నలిస్ట్ వాలంటీన్ లో అభిప్రాయపడినట్టు..రాణి మరణానంతరం విస్తృత కథనాలు వచ్చాయి.
అయితే అదే పుస్తకానికి సంబంధించి ఇప్పుడు భిన్నమైన వార్తలొస్తున్నాయి. ఈ గురువారం బ్రిటన్‌లో విడుదలైన ఈ పుస్తకం ప్యాలెస్‌లో ప్రిన్స్ హ్యారీ జీవితంపై సంచలనకర విషయాలు వెల్లడించింది. రాజకుటుంబం నుంచి ప్రిన్స్ హ్యారీని బయటకు తీసుకొచ్చి మేఘన్…ఆయనకు అతిపెద్ద సాయం చేశారని ఆ పుస్తకం తెలిపింది. ప్యాలెస్‌లో ఆయన చాలా నిరాశానిస్పృహలతో ఉండేవారని పుస్తకంలో రచయిత తెలిపారు. హ్యారీ గురించి బాగా తెలిసిన వ్యక్తే ఈ విషయం వెల్లడించారని చెప్పారు. హ్యారీ సంతోషంగా లేరన్న విషయం తెలిసినప్పటికీ….సమస్యకు పరిష్కారం దొరకలేదని, మేఘన్ ప్యాలెస్‌లోకి వచ్చిన తర్వాత ఆమె సమస్యను గుర్తించి పరిష్కరించారని ప్రశంసించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
రాజకుటుంబం గురించి పుస్తకాలు రాసే మరో నిపుణుడు టామ్ బౌర్ ప్రిన్స్ హ్యారీ గురించి మరో నిజం బయటపెట్టారు. చిన్నతనంలోనే తల్లి డయానా మరణం, డయానాతో తన తండ్రి ప్రవర్తన వంటివాటితో హ్యారీ డిస్ట్రబ్డ్‌గా ఉండేవారని… ఈ విషయాలన్నీ తెలుసుకున్న మేఘన్ హ్యారీని తెలివిగా తనవైపు తిప్పుకున్నారని విశ్లేషించారు. తన తెలివితేటలన్నీ ప్రయోగించి హ్యారీ…తనను నమ్మేలా చేసుకున్నారని తెలిపారు. మేఘన్‌పై హ్యారీ ఆ స్థాయిలో ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదే కారణమన్నారు.