భార్య కోసం..ప్రిన్స్ హ్యారీ సంచలన నిర్ణయం

భార్య కోసం..ప్రిన్స్ హ్యారీ సంచలన నిర్ణయం

Updated On : February 20, 2021 / 11:41 AM IST

prince harry : బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్య కోసం ఆయన రాచరికాన్ని వదులుకున్నారు. తనకు రాచరికంగా లభించే అన్ని గౌరవ పదవులు త్యజించారు. మిలటరీ పదవులు, ఇతర పదవులు అన్నీ వదులుకుంటున్నట్టు రాణి ఎలిజిబెత్ 2కి తెలిపారు. ఈ విషయాన్ని బకింగ్ హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. తాను, తన భార్య మేఘన్ మార్కెల్ ఇకపై రాయల్ ఫ్యామిలీగా రాబోమని వారు స్పష్టం చేశారు. ఇద్దరూ ఏడాది క్రితం రాచరిక విధుల నుంచి తప్పుకోవడం పెద్ద సంచలనానికి దారి తీసింది.

ప్రస్తుతం వారిద్దరూ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటూ కొన్ని కమర్షియల్ వెంచర్స్ స్థాపించి తమకు నచ్చిన కొత్త జీవితాన్ని గడుపుతున్నారు. 2020 ప్రారంభంలో దీనికి సంబంధించి తొలి అడుగు పడింది. అప్పుడు బ్రిటన్ రాణితో అత్యవసర శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. అయితే, వారు ఏడాది తర్వాత తమ నిర్ణయంపై పునరాలోచిస్తామని చెప్పారు. ఇప్పుడు తాము ముందుకు వెళ్లడానికే సిద్ధపడ్డామని, రాచరికం వద్దని తేల్చి చెప్పారు.
మాజీ సైనికుడు అయిన ప్రిన్స్ హ్యారీ మిలటరీలో కొన్ని గౌరవ పదవులను కలిగి ఉన్నారు. మరికొన్ని గౌరవ పదవులను కూడా ఆయన నిర్వర్తిస్తున్నారు. అయితే వీటిని తిరిగి మహారాణికి అప్పగించేశారు. ఇక ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ కూడా తనకు ఉన్న గౌరవ పదవులను త్యజించారు.